Satya Kumar: జగన్ ఒక్కొక్కరి తలపై రూ. 1.80 లక్షల అప్పు పెట్టారు: బీజేపీ నేత సత్యకుమార్

Jagan put debt of RS 2 laks on each head says BJP Satya Kumar
  • జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న సత్యకుమార్
  • వైసీపీ నేతల అరాచకాలు తార స్థాయికి చేరుకున్నాయని వ్యాఖ్య 
  • సొంత జిల్లాలో కూడా జగన్ రోడ్లు వేయలేకపోయారని విమర్శ
జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరి తలపై జగన్ రూ. 1.80 లక్షల కోట్ల అప్పును పెట్టారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు తార స్థాయికి చేరాయని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలకు రక్షణే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన ఒక ఎంపీ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోలేకపోతున్నానని... పక్క రాష్ట్రమైన తెలంగాణకు వెళతానని చెప్పడం ఆ పార్టీకి సిగ్గు చేటని అన్నారు. 

అనంతపురం జిల్లాలో దివ్యాంగులకు ఇచ్చిన 10 సెంట్ల స్థలాన్ని కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని... వారిని ప్రశ్నించిన దివ్యాంగులపై పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని సత్యకుమార్ మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకం కింద ఒక్కో కూలీకి కేంద్ర ప్రభుత్వం రూ. 272 ఇస్తుంటే... అందులో కమిషన్ల పేరుతో వైసీపీ నేతలు దోచుకుని, కూలీలకు కేవలం రూ. 150 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. సొంత జిల్లా కడపలో కూడా జగన్ రోడ్లను వేయలేకపోయారని దుయ్యబట్టారు.
Satya Kumar
BJP
Jagan
YSRCP
Andhra Pradesh
Debts

More Telugu News