Assembly elections: డిసెంబర్ లోపే తెలంగాణలో ఎన్నికలు!

  • రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన ఈసీ బృందం
  • ఎన్నికల సంసిద్ధతపై అధికారులతో వరుస భేటీలు
  • గత ఎన్నికల కంటే ముందే నిర్వహించే యోచనలో ఈసీ
assembly elections in telangana will be commensed before December

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ పరోక్షంగా సంకేతాలిచ్చింది. డిసెంబర్ లోపే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించిన ఈసీ బృందం.. ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. టైం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. దీంతో గత ఎన్నికల కంటే ముందే.. అంటే డిసెంబర్ 7 లోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఎలక్షన్ కమిషన్ బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్ కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ఈ బృందం మూడు రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించింది. ఎలక్షన్ కమిషన్ కొత్తగా తీసుకువచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ల వాడకంపై అధికారులకు అవగాహన కల్పించినట్లు సమాచారం.

ఓటర్ జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, పోలీస్ చెక్ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈసీ బృందం చర్చించింది. అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మూడేళ్లు ఒకేచోట ఉన్న అధికారుల బదిలీలు తొందరగా చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్, జాయింట్ సీఈవో సత్యవాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Telugu News