Nara Lokesh: ​​పాస్టర్లు పెళ్లిళ్లు నిర్వహించడానికి శాశ్వత లైసెన్స్ ఇస్తాం: నారా లోకేశ్

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • వజ్జావారిపాలెంలో పాస్టర్లతో లోకేశ్ ముఖాముఖి
  • లోకేశ్ కు తమ సమస్యలు విన్నవించిన చర్చి పాస్టర్లు
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా ఆదుకుంటామని హామీ
  • పాస్టర్లకు ఐడీ కార్డులు ఇచ్చి గౌరవ వేతనం అందజేస్తామని వెల్లడి
Nara Lokesh held meeting with church pastors in Vajjapuram

టీడీపీ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. 136వ రోజు యువగళం పాదయాత్ర వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో తనను కలిసేందుకు వచ్చిన వందలాది అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. అంతకుముందు వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ లో పాస్టర్లతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.  వారి సమస్యలు, కష్టనష్టాలు తెలుసుకున్నారు.

పాస్టర్లు తమ సమస్యలను తెలియజేస్తూ...

"పాస్టర్లకు హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నాం. గుర్తింపు కార్డులు కూడా కావాలి. జగన్ గెలిచిన వెంటనే పాస్టర్ల కు గౌరవ వేతనం ఇస్తామని మోసం చేశారు. శ్మశాన స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కమ్యూనిటీ హాల్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. 

పాస్టర్ ట్రైనింగ్ కోసం విద్యార్థులకు సహాయం చెయ్యాలి. ఇండిపెండెంట్ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. చర్చిల నిర్మాణానికి సహాయం అందడం లేదు. జగన్ పాలనలో చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు పెరిగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు రక్షణ కల్పించండి" అని విజ్ఞప్తి చేశారు.

పాస్టర్ల సమస్యల పట్ల లోకేశ్ స్పందిస్తూ...

జగన్ కులం, మతం డబ్బేనని, డబ్బు కోసం ఆయన ఎవరి ప్రయోజనాలనైనా తాకట్టుపెడతారని లోకేశ్ దుయ్యబట్టారు. అందరూ ఒక మతాన్ని నమ్ముకుంటారు, మిగిలిన మతాలను గౌరవిస్తారని, కానీ జగన్ కులం, మతం మాత్రం క్యాష్ అని విమర్శించారు. 

"రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదు. కట్టుబట్టలతో మనల్ని బయటకి గెంటేశారు. లోటు బడ్జెట్ ఉన్నా ఎవరికీ లోటు లేకుండా చంద్రబాబు పాలన కొనసాగింది. కులం, మతం, ప్రాంతం చూడకుండా చంద్రబాబు అందరికీ సాయం అందించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుక, పెళ్లి కానుక, జెరూసలేం యాత్రకు సహాయం అందించారు. 

నెల్లూరులో కమ్యూనిటీ హాల్ కట్టడానికి టీడీపీ రూ.1.5 కోట్ల విలువ చేసే భూమిని సేకరించింది . నెల్లూరులో రూ.25 కోట్లు విలువైన స్థలాన్ని టీడీపీ ప్రభుత్వం శ్మశానం కోసం కేటాయించింది" అని వివరించారు. 

జగన్ పాలనలో పాస్టర్లు కూడా బాధితులే!

జగన్ చేతిలో పాస్టర్లు కూడా బాధితులే. ఇండిపెండెంట్ చర్చి పాస్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చర్చిల నిర్మాణానికి సహాయం అందించడం లేదు. కరోనా సమయంలో పాస్టర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సల్ హెల్త్ స్కీం ప్రారంభిస్తాం. పాస్టర్లకు హెల్త్ కార్డులు అందజేస్తాం. 

పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని జగన్ మోసం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి దాని ద్వారా గౌరవ వేతనం అందజేస్తాం. పాస్టర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తాం. 

చర్చిల నిర్మాణానికి సహాయం చేస్తాం

చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుండే చర్చిలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి సహాయం అందిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చిల నిర్మాణానికి సహాయం అందిస్తాం, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. ఏపీని జగన్ పాత బీహార్ లా మార్చేశాడు. హత్యకి ఒక రేటు, రేప్ కి ఒక రేటు పెట్టాడు.  జగన్ పాలనలో చర్చిపై వైసీపీ జెండా ఎగరేశారు. పాస్టర్ల పై దాడులు జరిగాయి. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పాస్టర్ పైన కానీ, చర్చి పైన కానీ దాడి జరగలేదు. హైదరాబాద్ మత ఘర్షణలు అరికట్టిన చరిత్ర టీడీపీది. 

టీడీపీ హయాంలో పెళ్లిళ్లు జరిపించడానికి శాశ్వత లైసెన్స్ ఇచ్చేవాళ్ళం. జగన్ వచ్చిన తరువాత ప్రతి మూడేళ్లకు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి అని నిబంధనలు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాస్టర్లు పెళ్లిళ్లు నిర్వహించడానికి శాశ్వత లైసెన్స్ ఇస్తాం. ప్రత్యేక క్రైస్తవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1770.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 17.3 కి.మీ.*

*137వ రోజు పాదయాత్ర వివరాలు (25-6-2023):*

*సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

సాయంత్రం

4.00 – మేనకూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – ఉడ్డిగుంట కండ్రిగ వద్ద స్థానికులతో సమావేశం.

4.50 – గ్రద్దకుంట క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

5.10 – తిమ్మాజీ కండ్రిగలో స్థానికులతో సమావేశం.

5.50 – నాయుడుపేట గాంధీమందిరం సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

7.00 – నాయుడుపేట టవర్ క్లాక్ వద్ద స్థానికులతో మాటామంతీ.

7.05 – వెల్ కం సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

7.15 – దర్గా సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

7.25 – ఆర్టీసి బస్టాండు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.

8.25 – నాయుడుపేట తుమ్మూరు వద్ద స్థానికులతో మాటామంతీ.

9.15 – మర్లపల్లి మిట్టలో స్థానికులతో సమావేశం.

9.25 – మర్లపల్లిలో స్థానికులతో మాటామంతీ.

10.10 – అన్నమేడు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News