Etela Rajender: ఢిల్లీలో తెలంగాణ పొలిటికల్ హీట్: ఆ భేటీ తర్వాత ఈటల, కోమటిరెడ్డి కీలక నిర్ణయం!

  • బీజేపీ పెద్దలతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి భేటీ
  • కేంద్రమంత్రులతో కేటీఆర్ వరుస సమావేశాలు
  • త్వరలో ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి వెళ్లే ఛాన్స్
Telangana political heat in Delhi

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ హీట్ కనిపిస్తోంది. ఓ వైపు పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ.. మరోవైపు అధిష్ఠానం పిలుపు మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో కలిసి ఢిల్లీలోనే పెద్దలను కలుస్తుండటం గమనార్హం. పార్టీ అగ్రనేతలతో వీరు తెలంగాణ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఈటల, రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించవచ్చునని అంటున్నారు. అయితే బీజేపీ అధిష్ఠానం బుజ్జగించి వారిని పార్టీలోనే కొనసాగించవచ్చునని చెబుతున్నారు.

మరోవైపు అమిత్ షా సహా కేంద్రమంత్రులతో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ భేటీ అవుతున్నారు. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్ లతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే కేంద్రమంత్రులు.. కేటీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వడాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇది అధికారిక కలయిక అన్నారు.

ఇదిలా ఉండగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏఐసీసీ నేతలను కలిసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న ఉదయం పదకొండు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి వారు ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలతో భేటీ కానున్నారని సమాచారం. వచ్చే నెలలో వారు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, తెలంగాణ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

More Telugu News