Overweight: బరువు తగ్గాలి... లేకపోతే ఎన్ని సమస్యలో!

  • 200 కోట్లకు చేరువలో అధికబరువుతో బాధపడుతున్న వారి సంఖ్య 
  • 650 మిలియన్ల మంది ఊబకాయులే!
  • హార్ట్ డిసీజ్ లు, క్యాన్సర్లకు అధికబరువుతో లింకు
  • ఊబకాయులను వెంటాడే మధుమేహం!
Story on overweight and obesity

ఒబేసిటీ... అదే స్థూలకాయం! ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వేధిస్తున్న సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం 2016 నాటికి ప్రపంచంలో 1.9 బిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 2021 గణాంకాల ప్రకారం వారిలో 650 మిలియన్ల మంది ఊబకాయులేనట. 18 అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో అధికబరువు, ఊబకాయంతో బాధపడుతున్నవారిని పరిగణనలోకి తీసుకుని డబ్ల్యూహెచ్ఓ ఈ నివేదిక రూపొందించింది. 

ఊబకాయం నివారణ, ఊబకాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య సంస్థ తాజాగా కార్యాచరణ రూపొందింది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 పాయింట్లు దాటితే వారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. బీఎంఐ 25 పాయింట్ల నుంచి 30 పాయింట్ల మధ్య ఉంటే వారిని అధిక బరువుతో బాధపడుతున్నవారిగా భావిస్తారు. 

ఒబేసిటి బాధితులు బయటకు కనిపించని జబ్బుల బారినపడే ముప్పు అధికం అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఊబకాయం వల్ల శరీరంలోని అవయవాలు, కీలక వ్యవస్థలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా, గుండెను ఇది బాగా దెబ్బతీస్తుందట. 2012లో చోటు చేసుకున్న హృద్రోగ, స్ట్రోక్ మరణాల్లో అత్యధికులు ఒబేసిటీతో బాధపడుతున్నవారేనని వెల్లడైంది. అధిక బీఎంఐ కలిగివున్న వారిలో కార్డియోవాస్కులార్ వ్యాధులు గుట్టుచప్పుడు కాకుండా పెరిగిపోతున్నట్టు గుర్తించారు. 

అంతేకాదు, ఈ ఒబేసిటీ రక్తంలో చక్కెర స్థాయులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది జీవక్రియలను అస్తవ్యస్తం చేయడం వల్ల మధుమేహం బారినపడే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. నడుం చుట్టూ ఉండే అదనపు కొవ్వు కారణంగా శరీరం ఇన్సులిన్ కు స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో కొవ్వులను, కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేసే శక్తి తగ్గిపోతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. 

అంతేకాదు, అధిక బరువు, ఊబకాయం వల్ల శరీరంలోని ఎముకలు, కీళ్లపై అధిక భారం పడుతుంది. ఒబేసిటీ ఉన్నవారు ఆస్టియో ఆర్థ్రయిటిస్ బారినపడే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా, ఒబేసిటీ వల్ల అనేక శరీర భాగాల్లో క్యాన్సర్ కారక కణజాలం పెరుగుతుంది. ఐసోఫేగస్, పేంక్రియాస్, పెద్ద పేగు, పురీషనాళం, రొమ్ము, కిడ్నీ, గాల్ బ్లాడర్, గర్భకోశ క్యాన్సర్లకు ఒబేసిటీకి సంబంధం ఉన్నట్టు అనేక పరిశోధనల్లో వెల్లడైంది. 

అటు, మహిళల్లో గర్భధారణ, ప్రసవం తదితర అంశాలను కూడా ఊబకాయం ప్రభావితం చేస్తుంది. గర్భం నిలవకపోవడం, గర్భవతుల్లో కనిపించే మధుమేహం, ప్రీఎక్లాంప్సియా వంటి దుష్పరిణామాలు కలుగుతాయి. అధికబరువు, ఒబేసిటీ బాధితులు శ్వాస సంబంధ సమస్యలతోనూ బాధపడుతుంటారు. వీరిలో పేరుకుపోయిన కొవ్వులు హృదయ కుహరం సరళతను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు అనుసంధానమైన శ్వాసనాళాలను కుచించుకుపోయేలా చేస్తాయి. 

ఊబకాయం తగ్గించుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సులువైన మార్గాలు. చక్కెర, కొవ్వు ఉంటే ఆహారం పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, శుద్ధి చేయని ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

More Telugu News