Sunil Gavaskar: టీమిండియాకు ఎంపిక కావాలంటే సర్ఫరాజ్ ఖాన్ ఇంకా ఏం చేయాలి?: గవాస్కర్

  • వెస్టిండీస్ టూర్ కు టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు
  • ముంబయి బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కు మొండిచేయి
  • గత 3 సీజన్లలో అతడి సగటు 100కి పైనే ఉందన్న గవాస్కర్
  • జాతీయ జట్టుకు ఎంపిక కానప్పుడు ఇంకా రంజీల్లో ఆడడం ఎందుకని వ్యాఖ్యలు
Gavaskar questions for not including Sarfraz Khan into Team India

గత కొంతకాలంగా భారత దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ పరుగులు వెల్లువెత్తిస్తున్నాడు. గత కొన్ని సీజన్లలో సర్ఫరాజ్ సెంచరీల మోత మోగించాడు. కానీ జాతీయ జట్టు నుంచి మాత్రం పిలుపు అందడంలేదు. తాజాగా వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన టీమిండియా టెస్టు జట్టులోనూ సర్ఫరాజ్ పేరు కనిపించలేదు. 

దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. గత 3 సీజన్లుగా సర్ఫరాజ్ ఖాన్ యావరేజి 100కి పైనే ఉందని వెల్లడించారు. ఈ విషయంలో డాన్ బ్రాడ్ మన్ అంతటివాడి తర్వాత రెండో స్థానంలో ఉంది సర్ఫరాజేనని తెలిపారు. టీమిండియాకు ఎంపిక కావాలంటే అతడు ఇంకా ఏంచేయాలని ప్రశ్నించారు. తుది 11 మందిలో స్థానం ఇవ్వకపోయినా ఫర్వాలేదు... కనీసం టీమ్ కు ఎంపిక చేయొచ్చు కదా అని సూచించారు. 

"నీ ఆటతీరును గమనిస్తున్నాం అని అతడికి సంకేతాలు ఇవ్వండి... లేకపోతే రంజీల్లో ఆడడం ఆపేయమనండి... టీమిండియాకు ఎంపిక కానప్పుడు ఇంకా అతడు రంజీల్లో ఆడడంలో అర్థమేముంటుంది?" అని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ 2019-20 రంజీ సీజన్ లో 154 సగటుతో 928 పరుగులు చేశాడు. 2021-22 రంజీ సీజన్ లో 122 యావరేజితో 982 పరుగులు నమోదు చేశాడు. 2022-23 సీజన్ లోనూ సర్ఫరాజ్ దూకుడు కొనసాగింది. ఇటీవలే ముగిసిన ఆ సీజన్ లో కేవలం 6 మ్యాచ్ ల్లో 556 పరుగులు చేసి సత్తా చాటాడు.

More Telugu News