Tamilnadu: ఎంపీ అభినందించిన కాసేపటికే ఊడిన ఉద్యోగం.. తమిళనాడు మహిళా డ్రైవర్ ను తొలగించిన బస్ ఓనర్

Just after received compliments from MP Kanimozhi women driver lost her job in tamilnadu
  • ఆమే రాజీనామా చేసిందంటూ యజమాని వివరణ
  • యజమాని మాటలు బాధించాయన్న డ్రైవర్ షర్మిల
  • షర్మిలను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించిన ఎంపీ కనిమొళి
తమిళనాడులోని కోయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్ గా పేరొందిన షర్మిల ఉద్యోగం ఊడింది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న షర్మిలను శుక్రవారం ఎంపీ కనిమొళి అభినందించారు. షర్మిల నడుపుతున్న బస్సులో ప్రయాణించి ప్రత్యేకంగా అభినందించి వెళ్లారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన గొడవతో బస్సు యజమాని షర్మిలను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. యజమాని మాత్రం బస్సులో జరిగిన గొడవపై మందలించానని, దీంతో షర్మిల తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని వివరించారు. ఈ ఘటనపై ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్‌ షర్మిలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

బస్సులో ఏం జరిగింది..
కోయంబత్తూరుకు చెందిన ఓ ట్రావెల్స్ లో బస్సు డ్రైవర్ గా షర్మిల విధులు నిర్వహిస్తున్నారు. సిటీలో బస్సు నడుపుతున్న ఏకైక మహిళా డ్రైవర్ కావడంతో షర్మిల పలువురు నేతల అభినందనలు అందుకున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ షర్మిల నడుపుతున్న బస్సులో ప్రయాణించి మరీ ఆమెను అభినందించి వెళ్లారు. శుక్రవారం ఉదయం షర్మిల నడుపుతున్న బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణించారు. షర్మిల పనితీరును దగ్గరి నుంచి చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించి వెళ్లారు.

ఈ ప్రయాణం సందర్భంగా ఎంపీతో పాటు పలువురు అనుచరులు కూడా బస్సులో ప్రయాణించారు. టికెట్ తీసుకోవాలని అడిగిన కండక్టర్ తో వారు గొడవకు దిగారు. కండక్టర్ రిపోర్ట్ చేయడంతో షర్మిలను ఆఫీసుకు పిలిచి మందలించినట్లు బస్సు యజమాని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన షర్మిల.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు వివరించారు. ఎంపీ కనిమొళి వచ్చే విషయం తమకు ముందుగా తెలియదని చెప్పారు.

షర్మిల ఏమంటున్నారు..
ఎంపీ కనిమొళితో పాటు బస్సులో ప్రయాణించిన వారు టికెట్ తీసుకున్నారని షర్మిల చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ అనుచరులలో కొంతమంది కండక్టర్ తో గొడవ పడగా.. తాను సర్దిచెప్పానని షర్మిల తెలిపారు. అయితే, బస్సు యజమాని మాత్రం కేవలం ప్రచారం కోసమే మనుషులను ఎక్కించుకుంటున్నానని ఆరోపించడం తనను ఆవేదనకు గురి చేసిందని చెప్పారు.
Tamilnadu
women bus driver
coimbatore
MP Kanimozhi
job lost

More Telugu News