Chiranjeevi: అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు... వివరాలు వెల్లడించిన చిరంజీవి

  • స్టార్ క్యాన్సర్ సెంటర్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మధ్య అవగాహన
  • పలు ప్రాంతాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
  • సద్వినియోగం చేసుకోవాలన్న చిరంజీవి
Free cancer screening tests for mega fans and cine labour

మెగా అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపేందుకు స్టార్ క్యాన్సర్ సెంటర్ తో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మధ్య అవగాహన కుదిరింది. దీనికి సంబంధించిన వివరాలను చిరంజీవి మీడియాకు తెలిపారు. 

అభిమానులు, సినీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. జులై 9న హైదరాబాదులో, జులై 16న విశాఖలో, జులై 23న కరీంనగర్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. రోజుకు 1000 మందికి చొప్పున పలు రకాల క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలు జరుపుతారని చిరంజీవి చెప్పారు. 

ఉచితంగా పరీక్షలు చేయించడమే కాకుండా, చికిత్సకు అయ్యే ఖర్చులో కొంత భరిస్తామని, అయితే ఆ మొత్తం ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. డాక్టర్లతో మాట్లాడి ఖరారు చేస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, ఈ కార్డుతో మున్ముందు కూడా చికిత్సలు చేయించుకునేందుకు వీలుంటుందని చిరంజీవి తెలిపారు. 

80 శాతం క్యాన్సర్లను ముందుగా గుర్తిస్తే, చికిత్స ఎంతో సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అందుకే, అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చిరంజీవి సూచించారు. 

ఇటీవలే హైదరాబాదులో స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More Telugu News