Smriti Irani: బీజేపీని ఓడించలేమని తేల్చేసింది: కాంగ్రెస్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మృతి ఇరానీ

  • బీజేపీని ఓడించేందుకు ఇతర పార్టీలు అవసరమని కాంగ్రెస్ స్పష్టం చేసిందన్న స్మృతి 
  • 1984లో సిక్కుల ఊచకోత, ఎమర్జెన్సీ వంటివి కాంగ్రెస్ ప్రేమకు నిదర్శనమా? అని ప్రశ్న
  • వంతెన నిర్మించలేని వారు ప్రజాస్వామ్య వంతెన ఎలా నిర్మిస్తారని నితీశ్ పై ఆగ్రహం
Congress seeking support since it cant defeat PM Modi alone Smriti Irani hits back at Rahul Gandhi

తాము ఒంటరిగా బీజేపీని ఓడించలేమని గ్రహించిన కాంగ్రెస్, ఇతర పార్టీలను కలుపుకుంటోందని, అయినప్పటికీ తామే విజయం సాధిస్తామని, ఒంటరిగా ఓడించలేమనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా బాహాటంగా వెల్లడించినందుకు కాంగ్రెస్ పార్టీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధన్యవాదాలు తెలిపారు. పాట్నాలో విపక్షాల భేటీ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హననాన్ని చూసిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో కలిసి రావడం చాలా విచిత్రంగా ఉందన్నారు. మేం ఒంటరిగా బీజేపీని ఓడించలేమని వారు ఈ సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని బాహాటంగా తెలిపినందుకు కాంగ్రెస్ కు ధన్యవాదాలు అన్నారు.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు ఇతర పార్టీల అవసరం ఉందని, కానీ అందరూ కలిసినా తమదే గెలుపు అన్నారు. 1984లో సిక్కుల ఊచకోత, 1975లో ఎమర్జెన్సీ వంటివి కాంగ్రెస్ ప్రేమకు నిదర్శనమా? అని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీని ఓడించడం సాధ్యం కాదని కాంగ్రెస్ అంగీకరించిందన్నారు. ప్రతిపక్షాలు ఏకం కావడం వల్ల మోదీ ముందు తమ సామర్థ్యం విఫలమైందని వారు దేశానికి సంకేతాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో అధికారం రాజభవనం నుండి ప్రజల వద్దకు చేరుకుందని, అందుకే ఎమర్జెన్సీ సమయంలో కటకటాల వెనక్కి వెళ్లినవారు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరుతున్నారన్నారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ పై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగల్‌పూర్ లో ఇటీవల వంతెన కూలిపోవడాన్ని గుర్తు చేస్తూ ఒక వంతెనను నిర్మించలేనివారు ప్రజాస్వామ్య వంతెనను ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో కలిసి రాలేనివారు ఇప్పుడు బ్లాక్ మెయిల్ మార్గాన్ని అవలంబిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కాగా, విపక్షాల భేటీకి ముందు పాట్నా కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్మృతి నిప్పులు చెరిగారు. 2024లో ప్రతిపక్షాల కూటమి ఐక్యంగా బీజేపీని ఓడించబోతోందని, బీజేపీ భారత్ ను విభజించి, ద్వేషం నింపుతోందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూడా స్మృతి విమర్శలు గుప్పించారు.

రవిశంకర ప్రసాద్ విమర్శలు

2024 సార్వత్రిక ఎన్నికల నిమిత్తం పాట్నాలో నితీష్ కుమార్ ఒక వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారని, అక్కడ పెళ్లి కుమారుడు ఎవరో చెప్పాలని ప్రధాని అభ్యర్థిని ఉద్దేశించి బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ అన్నారు. అక్కడ ప్రతి ఒక్కరు తమను తాము అభ్యర్థులుగానే భావిస్తున్నారన్నారు. విపక్ష నేతలకు ఒకరి మీద మరొకరికి ఇష్టం లేకపోయినప్పటికీ ప్రజలు మాత్రం తమను ఇష్టపడాలని కోరుకుంటున్నారన్నారు.

More Telugu News