hotel: ఒక్క రూపాయి చెల్లించకుండా రెండేళ్ల పాటు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు.. ఎలా జరిగిందంటే..!

  • బిల్ ట్యాంపరింగ్ ద్వారా సహకరించిన హోటల్ సిబ్బంది
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన హోటల్ అధికారి
  • ఒక రోజుకు గదిని బుక్ చేసుకొని రెండేళ్లు ఉన్న గెస్ట్
  • డబ్బులు చెల్లించనప్పటికీ ప్రతిసారి బసను పొడిగిస్తూ వచ్చిన సిబ్బంది
Man stays at five star hotel in Delhi for 2 years without paying a single penny

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ రోసేట్ హౌస్ లో కొంతమంది హోటల్ సిబ్బంది సహకారంతో ఒక అతిథి ఒక్క పైసా చెల్లించకుండా దాదాపు రెండేళ్ల పాటు అక్కడే ఉండడంతో రూ.58 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.

సదరు అతిథికి సహకారం అందించిన సిబ్బంది బిల్లు ట్యాంపరింగ్ చేసి, అతనిని హోటల్ లో 603 రోజుల పాటు ఉండేందుకు అనుమతించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సదరు అతిథి అంకుశ్ దత్తాపై, సహకరించిన సిబ్బందిపై హోటల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'అసోంకు చెందిన దత్తా, మే 30, 2019న హోటల్‌లో చెక్ ఇన్ చేసి, ఒకరోజు కోసం గదిని బుక్ చేశాడు. అతను తన గుర్తింపు రుజువుగా తన పాస్‌పోర్ట్ కాపీని సమర్పించాడు. తిరిగి అతను మే 31న హోటల్ చెక్ ఔట్ చేయలేదు. జనవరి 22, 2021 వరకు తన బసను పొడిగిస్తూనే వచ్చాడు' అని ఫిర్యాదుదారు తెలిపారు.

రూమ్ ధరలు, ఇతర ఛార్జీలను నిర్ణయించిన ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాశ్ ఇందుకు బాధ్యత వహించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. HOD అయినందున అతను బకాయిల బిల్లులను నిర్వహిస్తున్నాడని, ప్రత్యేకమైన ID, పాస్‌వర్డ్‌ని కలిగి ఉన్నాడని, దీని ద్వారా అతను అందరు అతిథుల ఖాతాలను యాక్సెస్ చేయగలడని ఫిర్యాదుదారు తెలిపారు.

దత్తా హోటల్లో ఉంటూ డబ్బులు చెల్లించకపోయినప్పటికీ... ప్రకాశ్ అతని బసను నిరంతరం పొడిగిస్తూ వచ్చాడని, అంతేకాకుండా సీనియర్ అధికారులకు దత్తాకు సంబంధించిన రోజువారీ బకాయి వివరాలను కూడా ప్రకాశ్ పంపించలేదని చెప్పారు.

హోటల్ నిబంధనల ప్రకారం, 72 గంటల కంటే ఎక్కువ సమయం ఉన్న అతిథులు డబ్బులు చెల్లించని పక్షంలో రోజువారీ డాక్యుమెంట్ రూపొందించాలి. నిబంధనల ప్రకారం, ఒక అతిథికి సంబంధించిన వివరాలను తయారు చేసి, సీఈవోకు, ఫైనాన్షియల్ కంట్రోలర్ (FC)కు పంపించాలని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

అక్టోబర్ 25, 2019 వరకు దత్తా యొక్క పెండింగ్ బకాయిలకు సంబంధించిన పే మాస్టర్ నివేదికను ప్రకాశ్ తయారు చేయలేదని ఆరోపించారు. ఇతర గెస్టులకు సంబంధించిన బకాయి నివేదికలను ప్రతిరోజు సీఈవో, ఎఫ్‌సీకి పంపించారని, కానీ ఆ జాబితాలో దత్తా పేరు లేదన్నారు. దత్తా కూడా నకిలీ చెక్కులు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News