KCR: ఏపీ, తెలంగాణ భూములపై చంద్రబాబే చెప్పారు: కేసీఆర్

KCR says land cost in telangana rises
  • గతంలో ఏపీలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు చెప్పారన్న కేసీఆర్
  • ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి తారుమారైందని వ్యాఖ్య
  • మంచి ప్రభుత్వం, అభివృద్ధితో భూముల ధరలు పెరుగుతాయన్న సీఎం
గతంలో ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనవచ్చునని చంద్రబాబు చెప్పేవారని, ఇప్పుడు భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పటాన్ చెరులో రూ.183 కోట్లతో రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో గత కొన్నేళ్లలో భూముల ధరలు భారీగా పెరిగాయని, ఏపీలో తగ్గాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తారుమారైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారని, మంచి ప్రభుత్వం, అభివృద్ధితో భూముల ధరలు పెరుగుతాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే సంగారెడ్డి నుండి హయత్ నగర్ కు మెట్రో వస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్ కు రూ.10 కోట్లు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని, దీనిని నెరవేరుస్తామన్నారు. పటాన్ చెరు వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాగా పని చేస్తున్నారన్నారు. గతంలో పటాన్ చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసేవారని, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వల్ల ఇక్కడి పరిశ్రమలు నిరంతరం మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయన్నారు. పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్ నలువైపులా ఐదు పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయని చెప్పారు.
KCR
Telangana
Chandrababu
Andhra Pradesh

More Telugu News