Kakinada: బోటు నుంచి సముద్రంలో జారిపడి రాత్రంతా ఈత కొడుతూ ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకారుడు

Fisherman Skids From Boat And Swims For 12 Hours
  • మరో ఐదుగురితో కలిసి కాకినాడ నుంచి చేపలవేటకు వెళ్లిన అప్పారావు
  • రాత్రి సముద్రంలో వలవేసి నిద్రపోయిన మత్స్యకారులు
  • మూత్ర విసర్జనకు లేచి సముద్రంలో జారిపడిన అప్పారావు
  • 12 గంటలపాటు ఈదుతూ ప్రాణాలు కాపాడుకున్న వైనం
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు నుంచి పొరపాటున జారిపడిన ఓ మత్స్యకారుడు రాత్రంతా సముద్రంలో ఈత కొడుతూ ఉదయానికి తీరం చేరుకుని ప్రాణాలు రక్షించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మత్స్యకారుడు  గేదల అప్పారావు మరో ఐదుగురితో కలిసి బోటులో చేపల వేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో కోనసీమ జిల్లాలోని అంతర్వేది హార్బర్‌కు చేరుకున్నారు. అక్కడ పట్టుబడిన చేపలను విక్రయించి తిరిగి చేపల వేటకు బయలుదేరారు. రాత్రి సముద్రంలో వలవేసి పడుకున్నారు. అర్ధరాత్రి చూస్తే అప్పారావు కనిపించకపోవడంతో మిగతా వారి గుండెలు ఆగిపోయినంత పనైంది. దీంతో బోటు నుంచి జారిపోయి ఉంటాడని భావించి గాలించారు. 

నడిరాత్రిలో 12 గంటలపాటు ఈత
సముద్రంలో వలవేసి నిద్రపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో మూత్రవిసర్జనకు లేచిన అప్పారావు అదుపుతప్పి సముద్రంలో జారిపడ్డాడు. జోరున వీస్తున్న గాలుల కారణంగా బోటుకు దూరంగా వెళ్లిపోయాడు. దీంతో మరోమార్గం లేకపోవడంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్నబోటు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వేటకు అంతర్వేది వెళ్లిన విశాఖ జిల్లా మత్స్యకారులు అప్పారావును గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Kakinada
Fisher Man
Antarvedi
Andhra Pradesh

More Telugu News