Andhra Pradesh: ఏపీలో జులై 1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు

AP Govt Conducting Special Camps in All Secretariats for 4 weeks
  • 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా అందించనున్న ప్రభుత్వం
  • నాలుగు వారాల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడి
  • ఈ నెల 24 నుంచి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న వలంటీర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపులలో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్యాంపుల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండానే అర్హులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల పాటు ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఈ క్యాంపుల ఏర్పాటుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.

కుల, నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధ్రువీకరణ, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, మరణ ధ్రువీకరణ, మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌, మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌, మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ), కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో సభ్యుల పేర్ల తొలగింపు వంటి 11 సర్వీసులు ఈ క్యాంపులలో ఉచితంగా అందజేస్తారు. వినతుల స్వీకరణ, రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్, సర్వీసు రిక్వెస్టులకు వేరువేరు డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు. అయితే, మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
Andhra Pradesh
special camps
secretariats
cm jagan
jagananna suraksha

More Telugu News