Robo Cops: సింగపూర్ పోలీస్ శాఖలో రోబో కాప్ లు

  • టెక్నాలజీని మరింతగా వినియోగించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం
  • పోలీస్ శాఖలోకి తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలు
  • గత ఐదేళ్లుగా రోబో కాప్స్ పై ట్రయల్స్
  • తొలుత చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
Robo cops in Singapore police dept

ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా, రోబోలు అన్ని పనులు చేస్తూ మానవ వనరులకు కొంతమేర ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఎంతో కీలకమైన సర్జరీలు సైతం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ రోబోలను ప్రవేశపెట్టింది. నగరంలో పెట్రోలింగ్ విధుల్లో ఈ రోబోలు పాలుపంచుకుంటున్నాయి. 

ఇదే రీతిలో సింగపూర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలను పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోబోలకు కెమెరాలు, సెన్సర్లు, సైరన్లు అమర్చుతారు. 

గత ఐదేళ్లుగా సింగపూర్ లో ఈ పోలీస్ రోబోలతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 అడుగులు. దీనికి అమర్చే కెమెరాతో 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. ఒక్కోసారి పోలీసులు ప్రాణాలకు తెగించి ఆపరేషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ రోబోలు కీలకపాత్ర పోషించనున్నాయి. 

ఈ రోబోల్లో స్పీకర్లు కూడా అమర్చి ఉంటాయి. ప్రజలు  విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సమయంలో ఈ రోబోలకు ఉన్న స్పీకర్ల ద్వారా పోలీసులు సంభాషించవచ్చు, ప్రజలకు సూచనలు పంపవచ్చు. అంతేకాదు, ఈ రోబోలకే మైక్రోఫోన్లు అమర్చి ఉంటాయి. వీటి ద్వారా ప్రజలు పోలీసు అధికారులతో మాట్లాడవచ్చు, తమ పరిస్థితిని వారికి తెలియజేయవచ్చు. 

కాగా, ఈ రోబో పోలీస్ సేవలను సింగపూర్ ప్రభుత్వం ఎంతో రద్దీగా ఉండే చాంగీ ఎయిర్ పోర్టులో మొదటగా వినియోగించనుంది.

More Telugu News