Suraj Randiv: ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్ గా బతుకు నెట్టుకొస్తున్న శ్రీలంక మాజీ క్రికెటర్

  • శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సూరజ్ రణదివ్
  • రిటైరైన తర్వాత ఆస్ట్రేలియా వలసవెళ్లిన వైనం
  • కుటుంబ పోషణ కోసం ఓ ట్రాన్స్ పోర్టు కంపెనీలో ఉద్యోగం
  • క్లబ్ క్రికెట్ ఆడుతూ, బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న రణదివ్
Sri Lanka former cricketer Suraj Randiv works as a bus driver in Australia

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ వంటి అంతర్జాతీయ క్రికెటర్ల లైఫ్ స్టయిల్ చూస్తే ఎంతో రిచ్ గా ఉంటుంది. క్రికెట్ తో పాటు వాణిజ్య ప్రకటనలు, ఇతర ఒప్పందాలతో కొందరు క్రికెటర్లు కొద్దికాలంలోనే కోట్లకు పడగలెత్తడం చూస్తుంటాం. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. 

రెండో వైపు చూస్తే... ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కొందరు ఆటగాళ్లు రిటైరైన తర్వాత సాదాసీదా జీవితం గడుపుతుండడం ఆశ్చర్యం కలిగించకమానదు. అందుకు ఉదాహరణ ఈ శ్రీలంక మాజీ క్రికెటర్. 

సూరజ్ రణదివ్ ఓ స్పిన్నర్. శ్రీలంక జాతీయ జట్టు తరఫున 12 టెస్టులు, 31 వన్డే మ్యాచ్ లు, 7 టీ20 పోటీలు ఆడాడు. శ్రీలంక జట్టుకు ఆడుతున్నప్పుడే ఆర్థికంగా పెద్దగా సంపాదించుకోని రణదివ్ రిటైరైన తర్వాత ఆస్ట్రేలియా వలస వెళ్లాడు. కుటుంబ పోషణ కోసం అక్కడ ట్రాన్స్ డేవ్ రవాణా సంస్థలో చేరాడు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడినప్పటికీ, ఎలాంటి నామోషీ పడకుండా ప్రస్తుతం బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

ఇదే కంపెనీలో శ్రీలంకకే చెందిన మరో మాజీ క్రికెటర్ చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్డన్ మ్వేంగా కూడా డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ ట్రాన్స్ డేవ్ కంపెనీకి ఓ క్రికెట్ క్లబ్ కూడా ఉంది. మ్యాచ్ లు ఉన్నప్పుడు క్రికెట్ ఆడడం, మ్యాచ్ లు లేనప్పుడు బస్ డ్రైవర్లుగా సేవలు అందించడం వీరి పని. 

అన్నట్టు... సూరజ్ రణదివ్ ఐపీఎల్ లో కూడా ఆడాడు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 8 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీశాడు.

More Telugu News