Pawan Kalyan: మత్స్యకారులకు ప్రోత్సాహం అందిస్తే స్విమ్మింగ్ క్రీడలో రాణిస్తారు: పవన్ కల్యాణ్

  • కాకినాడలో మత్స్యకారులతో పవన్ కల్యాణ్ సమావేశం
  • ఈసారికి జనసేనను గెలిపించాలని విజ్ఞప్తి
  • ఏ పదవి లేకపోయినా ప్రధాని మోదీ తనను గౌరవిస్తున్నారని వెల్లడి
  • తమను గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి మత్స్యకారుల కోసం పాటుపడతానని హామీ
Pawan Kalyan said fishermen can do better in swimming if we give encouragement

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. మత్స్యకారుల్లోనూ ఎంతో మంచి స్విమ్మర్లు ఉన్నారని, వారికి గనుక సరైన ప్రోత్సాహం అందిస్తే స్విమ్మింగ్ క్రీడలో రాణిస్తారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవనశైలికి ఆక్వాస్పోర్ట్స్ దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు. 

మత్స్యకార వృత్తిని వ్యవసాయంతో సమానంగా చూడాలని అన్నారు. సీఎం జగన్ లా అద్భుతాలు చేస్తానని చెప్పను గానీ, నేను మీ కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. మత్స్యకారుల వంటి ఉత్పత్తి కులాలకు ఇసుక వంటి సహజ ఖనిజాల కాంట్రాక్టులు ఇస్తే వారిలో ఆర్థిక అసమానతలు తొలగించవచ్చని పేర్కొన్నారు. 

మత్స్యకారులు సరైన నాయకులను ఎన్నుకోవాలని, మత్స్యకారులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. 

"ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలపాలని మత్స్యకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు అండగా ఉండండి. ఈసారి ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్థులను గెలిపించండి. మీ కోసం మరింత బలంగా పనిచేస్తాను. ఏ పదవి లేకపోయినా ప్రధాని మోదీ నాకు గౌరవం ఇస్తున్నారు. అదే మీరు మమ్మల్ని గెలిపిస్తే కేంద్ర మంత్రులతో మాట్లాడి మీ కోసం పనిచేయగలను. 

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే దివీస్ వంటి పరిశ్రమలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా వ్యర్థాలు వదలకుండా, పర్యావరణానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటాను. నేను పరిశ్రమలకు వ్యతిరేకం కాదు... కానీ పరిశ్రమలు మీ జీవితాలను, ఉపాధిని దెబ్బతీసేలా ఉంటే చూస్తూ ఊరుకోను. మత్స్యకారులకు సొంత పడవలు ఉండేలా సాయం చేస్తాం" అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

More Telugu News