Chandrababu: భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సులను ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు

  • ఇటీవల మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించిన చంద్రబాబు
  • భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట టీడీపీ మేనిఫెస్టో
  • తాజాగా రాష్ట్రంలోని 5 జోన్లకు 5 బస్సులు ప్రారంభం
Chandrababu inaugurates buses to campaign TDP manifesto

తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరిట ఇటీవల తొలి దశ మేనిఫెస్టో వెల్లడించిన సంగతి తెలిసిందే. 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున నగదు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు ఏటా రూ.20 వేలు, కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు... ఇలా మేనిఫెస్టోలో కీలక అంశాలను పేర్కొన్నారు. 

కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ బస్సు యాత్ర చేపడుతోంది. ఇవాళ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని 5 జోన్లకు 5 బస్సులను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

More Telugu News