Gita Press: గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతి

Gandhi Peace Prize 2021 to be conferred on Gita Press Govt
  • 2021 సంవత్సరానికి ఎంపిక చేసిన కేంద్రం
  • సమాజంలో మార్పునకు చేసిన కృషికి గుర్తింపు
  • ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి అభినందనలు
  • విమర్శలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ
గోరఖ్ పూర్ లోని గీతాప్రెస్ కు 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి లభించింది. అహింస, ఇతర గాంధేయ విధానాలతో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన మార్పునకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ సత్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటన విడుదల చేసింది. 

1995లో గాంధీ శాంతి బహుమతిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీ ఆదర్శాలకు నివాళిగా దీన్ని ఏటా ప్రకటిస్తుంటుంది. జాతి, కుల, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా దీనికి అర్హులే. అవార్డు విజేతలకు రూ.కోటి నగదు బహుమానం కూడా అందుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల జ్యూరీ సంప్రదింపుల తర్వాత గీతా ప్రెస్ ను ఈ అవార్డు కోసం ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. 

గీతా ప్రెస్ 1923లో ఏర్పాటు కాగా, సరిగ్గా శతాబ్ది ఉత్సవ సమయాన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అవార్డు రావడం గమనార్హం. ఈ సంస్థ హిందూ ధర్మానికి సంబంధించి పుస్తకాలను ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా వాటిని విక్రయిస్తుంటుంది. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద ప్రచురణ సంస్థగా ఉంది. 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. ఇందులో 16.2 కోట్ల ముద్రణలు భగవద్గీతకు సంబంధించినవి కావడం గమనించొచ్చు.

‘‘2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన గోరఖ్ పూర్ గీతా ప్రెస్ కు అభినందనలు. ప్రజల్లో సాంస్కృతిక, సామాజిక పరివర్తన కోసం 100 ఏళ్ల పాటు చేసిన సేవలు నిజంగా ప్రశంసనీయం’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం అభినందనలు చెప్పారు. 

గాంధీ శాంతి బహుమతికి గీతా ప్రెస్ ను ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గీతా ప్రెస్ ను ఎంపిక చేయడం ద్వారా అవార్డును అవహేళన చేశారని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
Gita Press
Gorakhpur
Gandhi Peace Prize
GOVT
Prime Minister
Narendra Modi
wishes

More Telugu News