Anand Mahindra: ప్రపంచ కుబేరులు మస్క్, ఆర్నాల్ట్ లంచ్ భేటీపై ఆనంద్ మహీంద్రా సరదా ట్వీట్.. కామెంట్ల వెల్లువ!

Who Paid For Lunch Anand Mahindras Question To Elon Musk and Bernand Arnault
  • మస్క్, ఆర్నాల్ట్ లంచ్ మీటింగ్ లో బిల్లు ఎవరు కట్టి ఉంటారంటూ మహీంద్రా సందేహం
  • ఈ విషయం గురించి తన భార్య ఆలోచిస్తోందని ట్వీట్
  • ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని రెస్టారెంట్ వాళ్లే బిల్లు కట్టుకుంటారంటూ నెటిజన్ల కామెంట్లు
ఆనంద్ మహీంద్రా.. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు. పనిలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటారు. వైరల్ వీడియోలను, కోట్స్ ను షేర్ చేస్తుంటారు. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తుంటారు. తాజాగా ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ భేటీపై సరదాగా ట్వీట్ చేశారు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్యారిస్ లో కలిసిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరిగిన వివా టెక్నాలజీ సదస్సుకు వీరు హాజరయ్యారు. ఈ సందర‍్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేశారు. వీరిద్దరి భేటీ ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనమైంది.

వీరిద్దరి లంచ్ మీటింగ్ పై ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘లంచ్ కు బిల్లు ఎవరు చెల్లించారని నా భార్య ఆలోచిస్తోంది... ఎలాన్ మస్క్?’’ అని ఆదివారం ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్, ఆర్నాల్ట్ ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఆయన ట్వీట్ కు వందలాది కామెంట్లు వచ్చి పడుతున్నాయి.

‘‘రెస్టారెంట్ వాళ్లే బిల్లు కట్టుకుంటారు.. మస్క్, ఆర్నాల్ట్ వచ్చినప్పుడు వాళ్లకు ఫ్రీ మార్కెటింగ్, ఫ్రీ పబ్లిసిటీ కదా మరి’’ అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ‘‘లంచ్ కు నన్ను పిలిచి ఉంటే.. బిల్లు మొత్తం నేనే కట్టేవాడిని’’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘‘వాళ్లు అక్కడ అసలేమీ తినరు.. ఇదిగో ఇలా.. మాట్లాడుకుంటారంతే’’ అంటూ ఒకాయన ఫొటో షేర్ చేశారు. ‘‘ఆర్నాల్టే బిల్లు కట్టి ఉంటాడేమో.. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చింది ఆయన కదా’’ అని ఇంకొకరు స్పందించారు. ఇండియన్లు ఎప్పుడు ఫుడ్ గురించే ఆలోచిస్తారంటూ ఒకరు సెటైర్ వేశారు.

కాగా ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 236.9 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నంబర్ వన్ స్థానాన్ని ఇటీవల తిరిగి దక్కించుకున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 233.4 బిలియన్‌ డాలర్లు. మొన్నటిదాకా తొలి స్థానంలో ఉన్న ఆర్నాల్ట్.. తన కంపెనీ షేర్లు పడిపోవడంతో రెండో స్థానంలోకి పడిపోయారు.
Anand Mahindra
Elon Musk
Bernand Arnault
Lunch Meet
paris

More Telugu News