Adipurush: ‘ఆదిపురుష్’లో డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరం.. చిత్ర బృందం కీలక నిర్ణయం!

  • ఆదిపురుష్’లో కొన్ని డైలాగ్స్ ను మార్చాలని మేకర్స్ నిర్ణయం
  • మార్పులతో కూడిన సినిమా వారంలో అందుబాటులోకి
  • ట్విట్టర్ లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన రచయిత మనోజ్ శుక్లా
adipurush team announced will revamp dialogues

‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. రెండు రోజుల కిందట సినిమా రిలీజ్ అయ్యాక విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. సినిమాలోని డైలాగ్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రావణుడిని ఉద్దేశించి ఇంద్రజిత్తుతో హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది.

సినిమాలోని కొన్ని డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైలాగ్స్ ను మార్చాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మార్పులతో కూడిన సినిమా వారంలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా ట్విట్టర్ లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘ప్రతి ఒక్కరి భావోద్వేగాలను గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అని నా అభిప్రాయం. ‘ఆదిపురుష్‌’ కోసం నేను 4,000 లైన్లకు పైగా డైలాగులు రాశాను. వాటిలో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోంది’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ సినిమాలో శ్రీరాముడిని, సీతమ్మను కీర్తిస్తూ చాలా సంభాషణలు ఉన్నాయి. కానీ వాటి కంటే ఈ 5 లైన్లే ఎక్కువ ప్రభావం చూపాయని అనిపిస్తోంది. నా సోదరులు ఎంతో మంది నన్ను ఘోరంగా విమర్శిస్తున్నారు. మూడు గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు’’ అని మనోజ్ శుక్లా వాపోయారు.

‘‘ఆదిపురుష్‌ సినిమాలో ఉన్న ‘జై శ్రీరాం’, ‘శివోహం’, ‘రామ్‌ సీతారామ్‌’ వంటి గొప్ప పాటలు నా కలం నుంచి పుట్టినవే. మీరు ఇవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అనుకుంటున్నా. నన్ను నిందించిన వారిపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా డైలాగులకు అనుకూలంగా లెక్కలేనన్ని వివరణలు ఇవ్వగలను, కానీ ఇవి మీ బాధను తగ్గించలేవు. ఒకరిపై ఒకరం ఫిర్యాదు చేసుకుంటే సనాతన ధర్మానికి నష్టం కలుగుతుంది. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీశాం’’ అని చెప్పారు.

‘‘మీరందరూ ‘ఆదిపురుష్‌’ను ఎంతో ఆదరిస్తున్నారు. భవిష్యత్తులోనూ మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉంటాయని ఆశిస్తున్నాను. మాకు ప్రేక్షకుల మనోభావాలు చాలా ముఖ్యం. అందుకే మూవీ యూనిట్‌ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. ఒక వారంలో ఈ మార్పును చేయనున్నాం. మీ అందరి సూచనలను గౌరవిస్తున్నాం’’ అని సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.

నిజానికి ఆదిపురుష్ డైలాగ్స్ విషయంలో వచ్చిన విమర్శలపై మనోజ్ నిన్ననే వివరణ ఇచ్చారు. కానీ వివరణ ఇవ్వబోయి ఇంకో వివాదానికి కారణమయ్యారు. ‘‘మేము తీసింది రామాయణం కాదు.. రామాయణం నుంచి స్ఫూర్తి పొందాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం కూడా. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు’’ అంటూ మరింత అగ్గిరాజేశారు. ఈ నేపథ్యంలో మరోసారి వివరణ ఇవ్వక తప్పలేదు.

More Telugu News