Thalapathy Vijay: రాజకీయాల్లోకి విజయ్.. నటుడిగా ఆ సినిమానే చివరిది!

  • కోలీవుడ్ అగ్ర హీరోగా వెలుగొందుతున్న దళపతి విజయ్
  • రాష్ట్ర వ్యాప్తంగా యూత్‌ లో ఆయనకు మంచి ఫాలోయింగ్
  • 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో
Thalapathy Vijay film with Venkat Prabhu will be his last film as an actor

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు. తమిళనాడులో సినిమాల్లోనే కాకుండా యూత్‌ లో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. 60కి పైగా చిత్రాలు చేసినా.. ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న విజయ్ లక్షలాది మంది అబిమానులను సంపాదించుకున్నారు. సామాజిక, రాజకీయ సందేశాలు ఇచ్చే సినిమాలు చేయడంలో ఆయన ముందుంటారు. సమాజం పట్ల బాధ్యత ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ రాజకీయాలపై అప్పుడప్పుడు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా స్పందిస్తుంటారు. తాజాగా పదో తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్పులు తెచ్చుకున్న వారిని చెన్నైలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.

నేటి విద్యార్థులే రేపటి ఓటర్లు అని, విద్యార్థులంతా ఇంటికి వెళ్ళాక డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయాలని తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. డబ్బు తీసుకుని ఓటు వేసే పద్ధతిని మార్చాలని పిలుపునిచ్చారు. డబ్బు తీసుకుని ఓటు వేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చే   ఉద్దేశంతోనే విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. 

ఆయన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఇందుకోసం సొంతంగా పార్టీగా కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసే సినిమానే ఆయనకు ఆఖరిదని తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

More Telugu News