usman khawaja: యాషెస్ లో ఖవాజా ఖలేజా.. వీరోచిత సెంచరీ.. బ్యాట్ విసిరేసి సంబురాలు!

  • రసవత్తరంగా సాగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు
  • ఇంగ్లండ్ కు దీటుగా బదులిచ్చిన ఆసీస్.. 126 పరుగులతో ఆడుతున్న ఖవాజా
  • ఇంగ్లండ్‌ గడ్డపై ఖవాజాకు ఇదే తొలి సెంచరీ
usman khawaja throws his bat air celebrate his 1st test century vs england

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు దూకుడైన ఆటతో 393 పరుగులు చేసి ఇంగ్లండ్ డిక్లేర్ చేస్తే.. రెండో రోజు ఆసీస్ కూడా దీటుగా బదులిచ్చింది. వరుస వికెట్లు కోల్పోయి ఓ దశలో కష్టాల్లో కూరుకుపోయిన కంగారూ జట్టును ఉస్మాన్ ఖవాజా ఆదుకున్నాడు. వీరోచిత సెంచరీతో టీమ్ ను రేసులో నిలిపాడు. 

విధ్వంసక బ్యాట్ మన్ వార్నర్‌.. నంబర్ వన్ ఆటగాడు లబుషేన్‌.. పరుగుల యంత్రం స్టీవ్ స్మిత్‌ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. ఇంగ్లిష్‌ బౌలర్లకు ఖవాజా అడ్డుగా నిలిచాడు. దీంతో స్కోరు 148-4 దశ నుంచి.. 311-5కి చేరింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖవాజా 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడితో పాటు అలెక్స్‌ క్యారీ (52) క్రీజులో ఉన్నాడు.

ఇక సెంచరీ చేసిన తర్వాత ఖవాజా వినూత్నంగా సెల్‌బ్రెషన్స్‌ చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ, తన బ్యాట్‌ను పైకి విసిరేసి, ఆసీస్‌ డ్రస్సెంగ్‌ రూమ్‌ వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఖవాజాకు ఇంగ్లండ్‌ గడ్డపై ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక ఓవరాల్‌గా ఇది 15వ టెస్టు సెంచరీ.

More Telugu News