Nara Lokesh: ​​యానాదులు కూడా జగన్ బాధితులే: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర
  • వెంకటగిరి జిల్లాలో యువగళం
  • కుల్లూరు క్యాంప్ సైట్ లో యానాదులతో ముఖాముఖి
  • యానాదులను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చిన లోకేశ్
Nara Lokesh held meeting with Yanadi community people

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనాల నడుమ 129వరోజు పాదయాత్ర కుల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు యానాది సామాజికవర్గీయులతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు, వివిధ గ్రామాల ప్రజలు యువనేత లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు.

యానాది యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములు డీనోటిఫై చేసి యానాదులకు కేటాయిస్తాం, యానాదుల వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి సోలార్ మోటార్లు ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరు క్యాంప్ సైట్ లో యానాది సామాజికవర్గీయులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... యానాదులు కూడా జగన్ బాధితులేనని వెల్లడించారు. 

"ఒక్క ఛాన్స్ అన్న జగన్ అందరినీ ముంచేశాడు, యానాదులు కష్ట జీవులు. కష్టాన్ని నమ్ముకున్నవారు. మత్స్యకారులుగా, కూలీలుగా, కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలను అభివృద్ది చేశాను. తాండాల్లో మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించాను. ఐటీడీఏలు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. 

500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించింది నాటి టీడీపీ ప్రభుత్వం. ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించాం. పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు పక్కా ఇళ్లు కట్టిస్తాం.

యానాదులకు దామాషా ప్రకారం నిధులు

యానాదులకు దామాషా ప్రకారం నిధులు కేటాయించి, కమ్యూనిటీ భవనాలు, శ్మశానాలు ఏర్పాటు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదుల కాలనీల్లో సీసీ రోడ్లు మంజూరు చేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. కరెంట్ లేని తాండా , గూడెంలకు కరెంట్ సౌకర్యం కల్పిస్తాం. 45 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశాడు. 

మహిళల్ని ఆదుకోవడం కోసం మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తాం. 5 ఏళ్లలో 90 వేలు ఇస్తాం. ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం. ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున రూ.30 వేలు ఇస్తాం.

యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది!

టీడీపీ పాలనలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని వైసీపీ ప్రభుత్వం మండలి సాక్షిగా అధికారికంగా ప్రకటించింది. యానాది యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత నాది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగ యువతకు రూ.3 వేల ఆర్ధిక సాయం అందిస్తాం. 

జగన్ ప్రభుత్వం... ఎస్టీలకి వచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది. నిధులు, విధులు లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది. జగన్ జీవో.217 తీసుకొచ్చి మత్స్యకారులుగా జీవిస్తున్న యానాదుల పొట్టకొట్టాడు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త జీవోని రద్దు చేసి చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి యానాదులకు అవకాశం కల్పిస్తాం. టీడీపీ హయాంలో యానాదులకు ఇచ్చిన భూముల్లో పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అటవీ భూములు అంటూ కొన్ని చోట్ల భూములు వెనక్కి లాక్కున్నారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1654.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16.1 కి.మీ.*

*130వ రోజు పాదయాత్ర వివరాలు (18-6-2023):*

*వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

సాయంత్రం

4.00 - తెగచర్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – గరిమెనపెంట ఎస్టీ కాలనీలో స్థానికులతో సమావేశం.

5.10 – గరిమెనపెంటలో స్థానికులతో సమావేశం.

6.10 – న్యూ రామకూరులో స్థానికులతో సమావేశం.

7.10 – రామకూరు కాలనీలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

7.55 – గొనుపల్లిలో స్థానికులతో సమావేశం.

8.40 – పెనుబర్తిలో స్థానికులతో మాటామంతీ.

9.10 – పెనుబర్తి శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News