mumbai: ముంబైలో రణరంగంగా యూత్ కాంగ్రెస్ సమావేశం

Youth Congress Meet Escalates Into Chair Fight In Mumbai
  • యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కునాల్ ను తప్పించాలని కొంతకాలంగా డిమాండ్
  • కునాల్ నితిన్ రౌత్ వర్గీయులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ వాతావరణం
  • ఘర్షణ నేపథ్యంలో మాట్లాడకుండానే వెళ్లిన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
ముంబైలో యూత్ కాంగ్రెస్ సమావేశంలో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు, వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ముందే ఇరువర్గాలు కుర్చీలు విసురుకొని, దాడులకు దిగారు. దీంతో శ్రీనివాస్ ఏమీ మాట్లాడకుండానే వెళ్లవలసి వచ్చింది. 

మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి రౌత్ ను తప్పించాలని చాలాకాలంగా ఒక వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది. తాజాగా నేడు యూత్ కాంగ్రెస్ సమావేశంలో రౌత్ వ్యతిరేక వర్గీయులు ఆయనను తప్పించాలని డిమాండ్ చేసిన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య సమన్వయం చేసేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేశారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో వేదిక రణరంగంగా మారడంతో కాంగ్రెస్ పెద్దలు అవాక్కయ్యారు. కాంగ్రెస్ నేతల ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
mumbai
Congress

More Telugu News