Mahesh Babu: యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ఆటపై మహేశ్ బాబు ఆశ్చర్యం!

New Era Of Cricket Mahesh Babus Interesting Post On Englands Declaration In Ashes Opener
  • నిన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభం
  • తొలి రోజు బజ్ బాల్ కాన్సెప్ట్ తో బాదేసిన ఇంగ్లండ్
  • బజ్‌బాల్‌తో క్రికెట్‌లో కొత్త శకం మొదలైందంటూ మహేశ్ బాబు ట్వీట్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్టు సిరీస్ శుక్రవారం మొదలైన విషయం తెలిసిందే. తొలి రోజే ఇంగ్లండ్ ప్లేయర్లు.. ఆసీస్ బౌలర్లను ఆడేసుకున్నారు. ఏకంగా 5 రన్ రేట్ తో 8 వికెట్లకు 393 పరుగులు చేశారు. తొలిరోజు కొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా.. కెప్టెన్ బెన్ స్టోక్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

తొలి రోజే భారీ స్కోరు బాదడం, ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉండగానే డిక్లేర్ చేయడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా చేరిపోయారు. ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌కు ఫిదా అయిపోయిన మహేశ్ బాబు.. టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం మొదలైందని, ఇంగ్లండ్ బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేశారు.

‘‘393-8 డిక్లేర్డ్. నేను చదువుతున్నది నిజమేనా..? అద్భుతం.. బజ్‌బాల్‌తో క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది’’ అని మహేశ్ బాబు రాసుకొచ్చారు. అయితే మహేశ్ బాబు ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూటిక్ లేకపోవడంతో అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ కు గురయ్యారు. రియల్ అకౌంటా? ఫేక్ అకౌంటా? అని కాస్త సందేహ పడ్డారు. కానీ ఫాలోవర్ల సంఖ్య 13.3 మిలియన్లు ఉండటంతో మహేశ్ బాబు అకౌంటేనని నిర్ధారించుకున్నారు.

ఇక యాషెస్ తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. జోరూట్ (152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118 నాటౌట్) శతక్కొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్ చేసింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ కాన్సెప్ట్‌ ను మాత్రం వదల్లేదు. ఓలీపోప్ (31), హ్యారీ బ్రూక్ (32), బెన్ స్టోక్స్(1) నిరాశపర్చినా.. జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 12 ఫోర్లతో 78) వన్డే తరహాలో ఆడాడు.
Mahesh Babu
Ashes 2023
England
bazball
Australia

More Telugu News