Mamata Banerjee: కాంగ్రెస్ మాతో కలవాలంటే బెంగాల్‌లో ఇలా చేయాలి: మమత మెలిక

Mamata sets terms for helping Congress to fight BJP at national level
  • బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు కాంగ్రెస్ తమ మద్దతు కోరుతోందన్న మమత
  • బెంగాల్ లో సీపీఎంతో ఉన్నంత వరకు కాంగ్రెస్ తమ వద్దకు రావొద్దని వ్యాఖ్య
  • జూన్ 23న బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల సమావేశం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాలు రచించేందుకు విపక్షాలు భేటీ కానున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జాతీయస్థాయిలో పోరాడేందుకు తమ పార్టీ మద్దతు కావాలని కాంగ్రెస్ కోరుతోందని, అయితే బెంగాల్ లో తాము కాషాయ పార్టీతో కుమ్మక్కయినట్లు ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దక్షిణ 24 పరగణాస్ లోని కాక్‌ద్విప్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, సీబీఎం, ఐఎస్ఎఫ్ లపై నిప్పులు చెరిగారు.

పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని, బెంగాల్ లో సీపీఎంకు ప్రధాన మిత్రపక్షంగా ఉందని మమత గుర్తు చేశారు. ఈ పార్టీలు రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షాలే అని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ సాయం కోరుతోందన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనని, కానీ బెంగాల్ లో సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నంత వరకు లోక్ సభ ఎన్నికల్లో సాయం కోసం తమ వద్దకు రావొద్దని కరాఖండిగా చెప్పారు. 

వచ్చే శుక్రవారం పాట్నాలో జరిగే జాతీయ ప్రతిపక్ష పార్టీల కీలక సమావేశంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు పాల్గొననున్నారు. ఇలాంటి సమయంలో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జూన్ 23న జరిగే సమావేశానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరుకానున్నారు.

వచ్చే నెలలో బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతున్నాయి. తృణమూల్, బీజేపీ, సీపీఎం మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మమత పొత్తుపై పై విధంగా వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీలకు జులై 11న ఎన్నికలు నిర్వహించనున్నారు.
Mamata Banerjee
Congress
BJP
West Bengal

More Telugu News