Professor Haragopal: సీఎం కేసీఆర్​ సంచలన నిర్ణయం.. ప్రొఫెసర్​ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత

  • హరగోపాల్ సహా 152 మందిపై కేసు
  • గతేడాది ఆగస్టులో తాడ్వాయి పోలీస్‌ స్టేషన్ లో ఎఫ్ఐఆర్
  • కేసు ఎత్తివేయాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం
UAPA case against Professor Haragopal withdrawn by TS govt

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని నిర్ణయించారు. హరగోపాల్ తో పాటు మరికొందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులను ఉపసంహరించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. హరగోపాల్ తోపాటు మొత్తం 152 మందిపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో గతేడాది ఆగస్టులో 19న ఈ కేసు నమోదైంది. ఉపాతో పాటు, ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. 

హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. కేవలం మావోయిస్టుల డైరీల్లో పేరు ఉందని హరగోపాల్, ఇతరులపై ఉపా కేసు నమోదు చేయడాన్ని ప్రజా సంఘాల నేతలు, విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తక్షణమే హరగోపాల్, మరికొందరిపై నమోదైన ఈ కేసును ఉపసంహరించాలని డీజీపీని ఆదేశించారు.

More Telugu News