President Of India: 2 కి.మీ. ఎత్తులో గంట‌కు 800 కి.మీ. వేగంతో విహరించడం గొప్ప అనుభూతినిచ్చింది: రాష్ట్రపతి ముర్ము

President Draupadi Murmu attend Dundigal Air Force Academy Combined Graduate parade
  • ఏప్రిల్‌లో సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన విషయాన్ని గుర్తు చేసుకున్న రాష్ట్రపతి
  • దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సీజీపీ పరేడ్‌కు హాజరైన ముర్ము
  • క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి
హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  న‌గ‌రంలోని దుండిగ‌ల్‌లో జ‌రిగిన ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్ ప‌రేడ్‌ (సీజీపీ)లో పాల్గొన్నారు. త్రివిధ దళాల అధినేత్రి హోదాలో ఈ పరేడ్ కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్‌ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ఈ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని తెలిపారు. 

భార‌తీయ వైమానిక ద‌ళం అన్ని శాఖ‌ల్లోనూ మ‌హిళా అధికారులను రిక్రూట్ చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. మ‌హిళా ఫైట‌ర్ పైలట్ల సంఖ్య భ‌విష్య‌త్తులో మ‌రింత పెర‌గ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఏప్రిల్‌లో తాను సుఖోయ్ 30 ఎంకేఐ ఫైట‌ర్ జెట్‌లో విహ‌రించిన‌ విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో విహరించి బ్ర‌హ్మ‌పుత్రి, తేజ్‌పూర్ లోయ‌లు, హిమాల‌యాల అద్భుతాల‌ను వీక్షించానని చెప్పారు. స‌ముద్ర మ‌ట్టానికి రెండు కిలోమీట‌ర్ల ఎత్తులో గంట‌కు 800 కిలోమీట‌ర్ల వేగంతో ఆకాశంలో విహరించడం తనకు గొప్ప అనుభూతిని మిగిల్చిన‌ట్లు ముర్ము తెలిపారు.
President Of India
Droupadi Murmu
Hyderabad
Air Force Academy

More Telugu News