Andhra Pradesh: ఏపీ సీఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రాజకీయ విమర్శలు.. ఆశ్చర్యపోతున్న జనాలు

Political criticism from AP CMO Twitter account
  • విమర్శలపాలు అవుతున్న సీఎంఓ కార్యాలయ నిర్వాకం
  • సీఎంఓ అధికారిక ఖాతాలో రాజకీయపరమైన విమర్శలు
  • విమర్శలు గుప్పిస్తున్న విపక్ష నేతలు
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన నిర్వాకం విమర్శలపాలు అవుతోంది. సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతాలో విపక్షాలపై జగన్ గుప్పించిన విమర్శలను ట్వీట్ చేశారు. ఈ మధ్యాహ్నం సీఎంఓ చేసిన ట్వీట్లలో ఏముందంటే...

"రెండు పక్కలా 2 పార్టీలు ఉంటే తప్ప నిలబడలేని బాబు మనకు ప్రత్యర్థి అట. 175 నియోజకవర్గాల్లో క్యాండేట్లను పెట్టలేని వ్యక్తి మనకు ప్రత్యర్థట. రాజకీయాల్లోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసమే త్యాగమంటున్న దత్తపుత్రుడు మరో వంక. 

రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదు. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు కుప్పంలో ఈరోజు ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్ కోసం నన్ను అడుగుతున్నాడు. సీఎంగా ఉన్న ఆ రోజుల్లో ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగలేడు. ప్రతి పేద కుటుంబం కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నాం. 

ఇదే గుడివాడ ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు" అంటూ ఈరోజు గుడివాడలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎంఓ ట్విట్టర్ లో పెట్టారు. 

ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ పరమైన నిర్ణయాలు తదితర అంశాలను ప్రజలకు తెలియజేయాల్సిన సీఎంవో ట్విట్టర్ ఖాతాలో ఏకంగా రాజకీయపరమైన విమర్శలను పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Andhra Pradesh
CMO
Twitter

More Telugu News