Chandrababu: నియంత కిమ్ సోదరుడే జగన్: కుప్పంలో చంద్రబాబు

  • సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • మీడియాతో చిట్ చాట్
  • వైసీపీ నేతలు పంచభూతాలను మింగేశారన్న టీడీపీ అధినేత
  • హుద్ హుద్ ను కూడా తట్టుకున్న విశాఖ అక్రమార్కులకు తల్లడిల్లుతోందని ఆవేదన
Chandrababu chit chat with media in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ నాయకులు పంచభూతాలను మింగేశారని అన్నారు. ప్రజల ఇళ్లపైనా ఈ రాక్షసులు పడతారు అని నేను చెపితే ముందుగా అంతా నమ్మలేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది కదా అని చెప్పారు. 

విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్ లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హుద్ హుద్ ను సైతం తట్టుకున్న విశాఖ, నేడు అక్రమార్కులకు విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యక్తులను, ప్రజలను భయపెట్టి జగన్ ఇంతకాలం పాలన చేశాడని చంద్రబాబు అన్నారు. 

అయితే ఇప్పటి వరకు జనం అన్నీ భరించారు... ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు... తిరుగుబాటు మొదలైంది  అని స్పష్టం చేశారు. ఇక రానున్న రోజుల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడమే మిగిలి ఉంది అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జంగ్ సోదరుడిలా రాష్ట్రంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పులివెందులలో జగన్ భయపెట్టి గెలుస్తున్నారని, కానీ కుప్పంలో ప్రజల అభిమానంతో తాను గెలుస్తున్నానని గర్వంగా చెప్పారు.

కుప్పంలో నేడు అన్ని అభివృద్ది పనులు నిలిపివేసింది వాస్తవం కాదా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేతగా తనపై ఉందని చంద్రబాబు చెప్పారు. 4 దశాబ్దాలుగా నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు... రాష్ట్రాన్ని గాడిన పెట్టి వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందరిలా భయపడి నేను రాష్ట్రాన్ని వదిలేస్తే, రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుందని, అలాంటి పరిస్థితి వస్తే ఎక్కువ బాధపడేది తానే అని చంద్రబాబు నాయుడు అన్నారు. 

రాష్ట్రంలో ప్రజల స్థితిగతులు చూసి మహానాడులో మేనిఫెస్టో విడుదల చేశాం అని చెప్పారు. పేదలను ధనికులను చేయడం అనేది తన సంకల్పం అని వివరించారు. దానిపైనా విమర్శలు చేస్తున్నారని, గతంలో హైదరాబాద్ లో చేసిన అభివృద్దితో అక్కడ పరిస్థితులు మారలేదా... ఇదీ కూడా అలాగే సాకారం చేస్తానని చెప్పారు. అప్పులు చేసుకుంటూ పోవడం గొప్ప విషయం కాదని, సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

నేడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణకు, ఏపీకి మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం రూ. 40 వేల కోట్లు ఉందని... టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ నష్టం ఉండేది కాదు అన్నారు. ఇలా వచ్చిన సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని చెప్పారు. 

2014 తరువాత 5 ఏళ్లలోనే ఎంతో అభివృద్ది చేశామని, మధ్యలో ఓటమి లేకుండా తెలుగుదేశం గెలిచి ఉంటే రాష్ట్రం ఎక్కడ ఉండేదో ఊహించండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ది ధ్యాసలో పడి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది వాస్తవమేనని, దీని వల్ల కూడా నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు.  

పవన్ కల్యాణ్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్యం బూతులు తిట్టడం, ఎదురు దాడి చేయడమే వైసీపీ నేతలు, మంత్రులు పనిగా పెట్టుకున్నారని మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

More Telugu News