Gujarat: తీరం వైపుగా దూసుకొస్తున్న ‘బిపర్‌జోయ్’.. గుజరాత్‌లో 74 వేల మందికిపైగా తరలింపు

  • నేడు తీరం దాటనున్న తుపాను
  • విపత్తు నిర్వహణ బృందాలను మోహరించిన ప్రభుత్వం
  • అప్రమత్తంగా కోస్ట్‌గార్డ్.. నౌకలు, హెలికాప్టర్ల మోహరింపు
  • తీరం వెంట కాపుకాసిన 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
Cyclone Biparjoy to make landfall today

అతి తీవ్ర తుపానుగా మారి గుజరాత్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘బిపర్‌జోయ్’ నేడు తీరం దాటనుంది. సౌరాష్ట్ర-కచ్, మాండ్వి-పాకిస్థాన్‌లోని కరాచీ తీరాల మధ్య గుజరాత్ సమీపంలోని జకౌ పోర్టు వద్ద తుపాను తీరం దాటనుంది. భారత వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఇప్పటి వరకు తీర ప్రాంతాల నుంచి 74 వేలకుపైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ బృందాలను మోహరించారు. 

గుజరాత్ తీరం వైపు తుపాను దూసుకొస్తుండడంతో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటకతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలను భారత వాతావరణశాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది. భారత తీర రక్షక దళం నౌకలు, రిలీఫ్ బృందాలు, హెలికాప్టర్లను మోహరించింది. సహాయక చర్యల కోసం 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుపాను ప్రభావంతో గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురు గాలులకు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి.

More Telugu News