Karnataka: కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్.. ఒక్కరోజు ఖర్చెంతంటే!

  • సోమవారం ఒక్క రోజే రూ.8.84 కోట్లు
  • రెండు రోజులకు ప్రభుత్వంపై రూ.10.24 కోట్ల భారం
  • ఈ లెక్కన ఏడాదికి రూ.3,400 కోట్ల దాకా వెచ్చించాల్సిందే
  • రవాణా శాఖ అధికారుల వెల్లడి
how much the free govt bus ride scheme will cost Karnataka per day

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం శక్తి స్కీమ్.. ఈ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, సిటీ బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదివారం ప్రారంభించింది. ఈ నెల 11 వ తేదీ  మధ్యాహ్నం 1 గంట నుంచి కర్ణాటకలో ఈ పథకం అమలులోకి వచ్చింది.

మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ కు సోమవారం ఒక్కరోజే ప్రభుత్వంపై రూ.8.84 కోట్ల భారం పడిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. రోజువారీ పనులకు వెళ్లే మహిళలు, ఉద్యోగస్తులు, విద్యార్థులతో పాటు పుణ్య క్షేత్రాల రూట్లలో నడిచే బస్సుల్లో ప్రయాణికులు ఈ స్కీమ్ ను ఉపయోగించుకున్నారని అధికారులు చెప్పారు. స్మార్ట్ కార్డ్ జారీ ఇంకా ప్రారంభించకపోవడంతో ఆధార్ సహా గుర్తింపు కార్డులను చూపించి మహిళా ప్రయాణికులు ‘జీరో టికెట్’ తీసుకున్నారని వివరించారు.

మధ్యాహ్నం నుంచి పథకం ప్రారంభించడంతో ఆదివారం నాటి ఖర్చు రూ.1.44 కోట్లు మాత్రమేనని చెప్పారు. మొత్తంగా తొలి రెండు రోజుల్లో ఈ పథకంతో ప్రభుత్వంపై రూ.10.24 కోట్ల భారం పడిందని అధికారులు చెప్పారు. సోమవారం నాటి ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే ఏటా ఈ పథకానికి ప్రభుత్వం రూ.3,400 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News