Amit Shah: ఏబీఎన్ రాధాకృష్ణ నివాసానికి వెళ్లి భేటీ కానున్న అమిత్ షా.. కారణం ఇదేనా?

  • ఈ అర్ధరాత్రి హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా
  • రేపు ఉదయం ఏబీఎన్ రాధాకృష్ణ నివాసానికి వెళ్లనున్న కేంద్ర హోం మంత్రి
  • తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం
Amit Shah to go to ABN Radha Krishna residence

దక్షిణాదిలో పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఇతర దక్షిణాది రాష్ట్రాల కన్నా కొంత ఎక్కువ బలం ఉండటంతో... వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానిస్తుండటంతో పాటు... సినీ సెలబ్రిటీలతో కూడా చనువుగా ఉండేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ అర్ధరాత్రి ఆయన హైదరాబాద్ కు రానున్నారు. 

మరోవైపు, రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. రాధాకృష్ణతో అమిత్ షా సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీలో ప్రధానంగా వీరు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై రాధాకృష్ణను అమిత్ షా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఏపీ రాజకీయాలు కూడా వీరి మధ్య చర్చకు రావచ్చని తెలుస్తోంది.

రాధాకృష్ణతో భేటీ అనంతరం ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళితో అమిత్ షా భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని ముగించుకుని హెలికాప్టర్ లో భద్రాచలంకు వెళ్తారు. రాములవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఖమ్మం చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని... 7.30 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ వెళతారు.

More Telugu News