Nigeria: నైజీరియాలో ఘోర ప్రమాదం... పెళ్లికి వెళ్లొస్తూ పడవ మునిగి 100 మంది మృతి!

  • నైజర్ నదిలో అలల తాకిడికి కుదుపులకు లోనై, చెట్టును ఢీకొట్టి మునిగిన పడవ
  • ఎగ్బోటి గ్రామంలో వివాహ వేడుకలకు హాజరై వస్తుండగా ఘటన
  • పడవలో మహిళలు, చిన్నారులు సహా వందమందికి పైగా ప్రయాణికులు
At least 100 dead after boat capsizes in Nigeria

నైజీరియాలో ఓ బోట్ మునిగిపోయిన ఘటనలో దాదాపు 100 మంది వరకు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున నైజర్ నదిలో ఈ సంఘటన జరిగింది. ప్రాణాలతో ఉన్న వారి కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి సమీపంలో జరిగినట్లు క్వారా రాష్ట్ర పోలీసు ప్రతినిధి ఒకాసన్మి అజయి తెలిపారు.

నదిలోని అలల ఉద్ధృతికి పడవ కుదుపులకు లోనై, ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ బోట్ లో ప్రయాణిస్తున్న వారు అందరూ కూడా నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారని చెబుతున్నారు. ఇందులో, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మునిగిన పడవలో దాదాపు వందమంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని, దీంతో ఇందులో చాలామంది నీటిలో మునిగిపోయారని చెబుతున్నారు. వేకువజామున జరగడంతో ఈ ప్రమాదం గురించి ఆలస్యంగా తెలిసిందని చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

మంగళవారం నాటికి కూడా అధికారులు, స్థానికులు నదిలో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. కాగా, నైజీరియాలో రవాణా పడవల ప్రమాదాలు సాధారణం. చాలా ప్రమాదాలు ఓవర్ లోడింగ్ వంటి కారణాలతో సంభవిస్తాయి. కానీ ఇప్పుడు చాలామంది మృత్యువాత పడ్డారు.

More Telugu News