Narendra Modi: ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు కట్టి అమ్ముకున్నారు: మోదీ

  • మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రధాని పరోక్ష విమర్శలు
  • డబ్బులు తీసుకుని, భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారని ఆరోపణ
  • అక్కడ ప్రతి ఉద్యోగానికి ఓ ‘రేటు’ ఉంటుందని వ్యాఖ్య
  • యువత భవిష్యత్తును కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి
pm modi attacks lalu mamata says his govt has safeguard against their rate cards

గతంలో రైల్వే శాఖ మంత్రులుగా పని చేసిన మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారని, రేటు కట్టి అమ్ముకున్నారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం యువత భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేస్తోందని చెప్పారు. 

రోజ్ గార్ మేళాలో భాగంగా ఉద్యోగాలు సాధించిన వారికి ఈ రోజు 70 వేల నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “ఒక రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నగదు తీసుకున్న కుంభకోణం గురించి మనం మీడియాలో కథనాలను చూశాం. ఒక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో భారీ స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఇది దేశంలోని యువతకు చాలా ఆందోళన కలిగించే విషయం’’ అని ప్రధాని అన్నారు.

‘‘మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే.. అక్కడ ప్రతి ఉద్యోగానికి ఓ ‘రేటు’ చూపే కార్డు ఉంటుంది. ఈ రేట్ కార్డుల ద్వారా పేదలను దోచుకున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించారు. స్వీపర్ ఉద్యోగం కావాలంటే ఒక రేటు, డ్రైవర్ ఉద్యోగం కావాలంటే ఇంకో రేటు. మీకు నర్సు, క్లర్క్ లేదా టీచర్ ఉద్యోగం కావాలంటే మరో రేటు ఉంటుంది. ప్రతి పోస్ట్ కోసం రేటు కార్డ్ ఆ రాష్ట్రంలో నడుస్తుంది’’ అని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డబ్బులకు ఉద్యోగాలిచ్చే (క్యాష్ ఫర్ జాబ్) రాకెట్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బయటపెట్టిన విషయాన్ని పరోక్షంగా ప్రధాని ప్రస్తావించారు. 

బీహార్ లో భూమి ఇస్తే ఉద్యోగమిచ్చే (లాండ్ ఫర్ జాబ్) కుంభకోణాన్ని కూడా ప్రధాని వివరించారు. ‘‘ఇటీవల మరో కేసు తెరపైకి వచ్చింది. ఓ రైల్వే మంత్రి ఉద్యోగం ఇప్పిస్తానంటూ పేద రైతుల భూమిని లాక్కున్నాడు. ఉద్యోగం ఇచ్చేందుకు భూములు తీసుకున్న కేసుపై సీబీఐ దర్యాప్తు కూడా నడుస్తోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి. బంధుప్రీతి పార్టీలు, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలు.. ఉపాధి పేరుతో దేశంలోని యువతను దోచుకుంటున్నాయి. మరోవైపున యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని ప్రధాని అన్నారు.

More Telugu News