Ravichandran Ashwin: డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాలో తనకు స్థానం లభించకపోవడంపై అశ్విన్ స్పందన

  • లండన్ లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్
  • 209 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
  • అశ్విన్ ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు
Ashwin opines on his exclusion from Team India during WTC Final

లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాలో చేతిలో టీమిండియా ఓటమిపాలవడం తెలిసిందే. దాంతో టీమిండియాపై అనేక విమర్శలు వచ్చాయి. 

ముఖ్యంగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎందుకు తీసుకోలేదంటూ సచిన్ టెండూల్కర్ అంతటివాడు సైతం బాహాటంగా నిలదీశాడు. ఎన్నో టెస్టు మ్యాచ్ ల్లో టీమిండియాను గెలిపించిన అశ్విన్... ఈ కీలక టెస్టు సమరంలో జట్టులో లేకపోవడం విదేశీ మాజీ క్రికెటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 

ప్రత్యర్థి జట్టులోని ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్ రాణించిన నేపథ్యంలో, అశ్విన్ జట్టులో ఉండుంటే పిచ్ పరిస్థితిని తప్పకుండా ఉపయోగించుకునేవాడన్న అభిప్రాయాలు వినిపించాయి. దీనిపై అశ్విన్ స్పందించాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాలో తనకు స్థానం లభించకపోవడం పట్ల తానేమీ బాధపడడంలేదని వెల్లడించాడు. తుదిజట్టులో 11 మంది కంటే ఎక్కువమందిని ఆడించలేరు కదా అని వ్యాఖ్యానించాడు.

పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో జడేజా రూపంలో ఒక్క స్పిన్నర్ కే జట్టులో చోటిచ్చారని వివరించాడు. అలాగని టీమిండియాలో లోపాలు లేవని చెప్పడంలేదని, జట్టు ఓడిపోయిన తీరు చాలా బాధ కలిగించిందని అశ్విన్ తెలిపాడు. 

రెండేళ్లు ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చామని, అలాంటిది ఆఖరి మెట్టుపై పరాజయం చవిచూడడం ఎవరికైనా బాధ కలిగించే అంశమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో, ఈ విజయానికి ఆసీస్ జట్టుకు అన్ని విధాలా అర్హత ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. 

గత రెండేళ్లుగా టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా భారత జట్టు ఆడిన మ్యాచ్ ల్లో అశ్విన్ మొత్తం 61 వికెట్లు పడగొట్టడం విశేషం.

More Telugu News