Pawan Kalyan: పవన్ కోసం.. లోకేషన్లు షిఫ్ట్ చేస్తున్న దర్శక నిర్మాతలు

  • సినిమాలతో పాటు రాజకీయాలపై పవర్ స్టార్ ఫోకస్
  • ఆయన కోసం విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ చేయాలని నిర్ణయం
  • రేపటి నుంచి ‘వారాహి యాత్ర’ చేపట్టనున్న పవన్
Tollywood producers is shifting locations for Pawan

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టారు. రేపటి నుంచి తన వారాహి వాహనంపై రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ వర్గాల నుంచి పవన్‌ కు మద్దతు వస్తోంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరగా.. పలువురు దర్శక నిర్మాతలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. వారిలో దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు డీవీవీ దానయ్య, ఏఎం రత్నం, రవిశంకర్, వివేక్ కూచిభొట్ల ఉన్నారు. 

ఈ క్రమంలో పవన్, దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. రాజకీయాల్లో బిజీగా కానున్న పవన్ కు అనువుగా ఉండేలా ఇకపై విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని లొకేషన్లను దర్శక నిర్మాతలు చూసి వచ్చారు. మంగళగిరికి తొలిసారి వచ్చానని.. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని హరీశ్ శంకర్ తెలిపారు. పవన్ ఇకపై మంగళగిరిలో ఉంటారని, ఆయన సినిమా షూటింగులే కాకుండా, ఇతర సినిమాల షూటింగులను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయని చెప్పారు.

More Telugu News