WTC Final: గెలిచిన ఆసీస్ కు.. ఓడిన ఇండియాకు ఐసీసీ భారీ జరిమానా.. గిల్ కు ఇంకాస్త!

  • స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత్, ఆసీస్ జట్లకు ఐసీసీ జరిమానా
  • టీమిండియాకు 100 శాతం, ఆసీస్ కు 80 శాతం కోత
  • అంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు గిల్ కు అదనపు ఫైన్
team india fined 100 per cent match fee in wtc final additional fine for gill

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో మొత్తం 100 శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. చాంపియన్ షిప్ గెలిచిన ఆస్ట్రేలియాకు కూడా జరిమానా తప్పలేదు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆసీస్‌ జట్టుకు మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధించింది.

ఈ మేరకు ఐసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో భారత్‌ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేసినట్లు తెలిపింది. మరోవైపు టీమిండియా ఓపెనర్‌ శుభమన్ గిల్‌ కు అదనపు జరిమానా పడింది. అంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అంటే మొత్తంగా గిల్‌కు 115 (100 15) శాతం జరిమానా పడింది.

రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కొట్టిన బంతిని స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్‌ వివాదాస్పదంగా మారింది. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్‌ అందుకున్నట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించారు. దీనిపై గిల్‌ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘థర్డ్ అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా?’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలు పోస్ట్‌ చేశాడు. దీంతో అదనపు జరిమానా పడింది.

‘‘గిల్‌ ఔట్‌ విషయంలో టెలివిజన్‌ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనదే. ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో గిల్ ఓ పోస్ట్ చేశాడు. ఐసీసీ ఆర్టికల్‌ 2.7 (మ్యాచ్‌లో జరిగిన ఘటనపై బహిరంగ విమర్శలు, అనుచిత వ్యాఖ్యల) నిబంధన కింద అతడు చేసింది తప్పిదమే’’ అని ఐసీసీ స్పష్టం చేసింది.

More Telugu News