Asia Cup: ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ కు భారత్ ఎట్టకేలకు సమ్మతి

  • మొదటి నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ లో నిర్వహణ
  • మిగిలిన షెడ్యూల్ శ్రీలంకకు తరలింపు
  • ప్రత్యామ్నాయ ప్రణాళికను తీసుకొచ్చిన పాకిస్థాన్
Asia Cup hybrid model may finally be accepted by BCCI

ఆసియాకప్ పై కొన్ని నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడనుంది. ఎట్టకేలకు ఆసియాకప్ వేదికపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సూచించిన హైబ్రిడ్ నమూనాకు, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ), భారత్ అంగీకారం తెలిపినట్టు తెలిసింది. భారత్ లేకుండా మిగిలిన దేశాలతో కూడిన నాలుగు స్లాట్లు మొదట పాకిస్థాన్ కు కేటాయించనున్నారు. ఇక మిగిలిన మ్యాచ్ లు, భారత్ - పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచులు సహా ఫైనల్ శ్రీలంకలో జరుగుతాయి. ఈ ప్రతిపాదనను పీసీబీ చీఫ్ నజమ్ సేతి రూపొందించారు. 

ఆతిథ్య పాకిస్థాన్ లో పర్యటించేందుకు వీలు కాదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేయడంతో, నజమ్ సేతి ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను ముందుకు తెచ్చారు. పాక్ లో పర్యటించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరాన్ని బీసీసీఐ వర్గాలు గుర్తు చేశాయి. ప్రణాళిక ప్రకారం.. పాక్-నేపాల్, బంగ్లాదేశ్-ఆప్ఘనిస్థాన్, ఆప్ఘనిస్థాన్-శ్రీలంక, శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరుగుతాయి. ఆ తర్వాత షెడ్యూల్ శ్రీలంకకు మారుతుంది. ఆరు జట్ల ఆసియాకప్.. రానున్న వన్డే ప్రపంచకప్ కు తగిన విధంగా సన్నద్ధం కావడానికి తోడ్పడనుంది. ఆసియాకప్ మ్యాచులు పాకిస్థాన్ లో జరుగుతున్నందున, పాక్ జట్టు భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ కు వచ్చేందుకు ఇబ్బంది తొలగిపోతుందని భావిస్తున్నారు. 

More Telugu News