won World Cups: అవును.. అతను ఒక్కడే ఆడి కప్పు గెలిచాడు..: ధోనీపై హర్బజన్ సింగ్ సెటైర్

  • ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడిన భారత్
  • దీంతో ధోనీ సారథ్యంలోనే కప్పులు వచ్చాయంటూ అభిమానుల ట్వీట్లు
  • మిగతా 10 మంది కాకుండా ధోనీ ఒక్కడి వల్లేనంటూ హర్బజన్ వ్యంగ్యం
Yes he won World Cups alone Harbhajan sarcastically tears into tweet praising MS Dhoni after India WTC final loss

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి అనంతరం.. క్రికెట్ అభిమానులు మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ నామ స్మరణ చేస్తున్నారు. మోదీ కెప్టెన్సీలో భారత్ ఎన్నో ఐసీసీ కప్పులు గెలవగా, ఆ తర్వాత ఒక్క కప్పూ కరువైపోవడాన్ని అభిమానులు ఏకరవు పెడుతున్నారు. ముఖ్యంగా ధోనీ అభిమానులు మరోసారి ట్విట్టర్ లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ వన్డే ప్రపంచ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక సారథి ధోనీయేనంటూ ప్రశంసలతో ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని చేసిన ట్వీట్ 2011 వన్డే ప్రపంచకప్ టీమ్ సభ్యుడు, మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కు గుచ్చుకుంది. దీనిపై హర్బజన్ విమర్శనాత్మకంగా స్పందించాడు.

‘‘కోచ్ లేడు. మార్గదర్శి కూడా లేడు. అంతా కుర్రాళ్లే. సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకునేందుకు ఇష్టపడలేదు. అంతకుముందు వరకు ఒక్క మ్యాచ్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించలేదు. ఈ కుర్రాడు సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఓడించాడు. కెప్టెన్ అయిన 48 గంటల్లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచాడు’’ అంటూ శ్రేయాస్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ పై హర్బజన్ సింగ్ ట్యాగ్ చేస్తూ, తనదైన శైలిలో స్పందించాడు.

‘‘నిజమే ఈ మ్యాచులు ఆడినప్పుడు ఈ ఒక్క కుర్రాడే భారత్ నుంచి ఆడాడు. ఇతర 10 మంది ఆటగాళ్లు ఆడనేలేదు. అతడు ఒక్కడే ప్రపంచకప్ ట్రోఫీలను గెలిచాడు. వ్యంగ్యం ఏంటంటే.. ఆస్ట్రేలియా అయినా, మరే దేశమైనా ప్రపంచకప్ గెలిస్తే ఆ దేశం గెలిచిందని చెబుతారు. కానీ, భారత్ గెలిస్తే మాత్రం కెప్టెన్ గెలిచినట్టు చెబుతారు. ఇవి జట్టుగా ఆడేవి. గెలిచినా సమష్టిగానే, ఓడినా సమష్టిగానే’’ అంటూ హర్బజన్ సింగ్ తన ట్వీట్ ద్వారా స్పందించాడు. తాము సైతం కష్టపడి ఆడడం వల్లే టీమిండియాకు అన్ని విజయాలు వచ్చాయని చెప్పేందుకు, తమను విస్మరించే అభిమానులకు దాన్ని గుర్తు చేసేందుకు హర్బజన్ ఇలా స్పందించినట్టు అర్థం చేసుకోవాలి.

More Telugu News