Indigo Plane: వాతావరణం అనుకూలించక పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లిన ఇండిగో విమానం

Indigo plane enters into Pakistan airspace due to bad weather
  • అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న విమానం
  • టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం
  • దాంతో లాహోర్ నగరానికి ఉత్తర దిక్కుకు చేరుకున్న ఇండిగో ప్లేన్
  • అరగంట తర్వాత తిరిగి భారత్ లో ప్రవేశం
ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే వాతావరణం మారిపోయింది. దాంతో ఆ ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. 

దాదాపు 30 నిమిషాల పాటు ఆ విమానం పాక్ గగనతలంలోనే ఉండిపోయింది. లాహోర్ నగరానికి ఉత్తర దిక్కులో చక్కర్లు కొట్టింది. అనంతరం, వాతావరణం అనుకూలించడంతో గుజ్రన్ వాలా వద్ద తిరిగి భారత్ లోకి ప్రవేశించింది. శనివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.01 గంటల వరకు ఈ విమానం పాక్ గగనతలంలో ఉంది. 

భారత విమానం పాక్ లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి అధికారులతో అమృత్ సర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంప్రదింపులు జరిపి మార్గం సుగమం చేసింది. ఆ విమానం అహ్మదాబాద్ చేరుకునే వరకు నిరంతరం పరిస్థితిని సమీక్షించింది.

వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు సాధారణమేనని, అంతర్జాతీయంగా అనుమతి ఉందని తెలిపారు. కాగా, మే నెలలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన విమానం ఒకటి ఇలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో భారత్ గగనతలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో పాకిస్థాన్ లో భారీ వర్షం పడుతుండడంతో ఆ విమానం 10 నిమిషాల పాటు భారత గగనతలంలోనే ఉండిపోయింది.
Indigo Plane
Pakistan
Airspace
India
Bad Weather

More Telugu News