Southwest Monsoon: వానమ్మ వచ్చేసింది.. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు!

  • శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై విస్తరించిన రుతుపవనాలు
  • అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి
  • వచ్చే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని ప్రకటన
  • ఈ ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని సూచన
weather report in ap and telangana

ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు. ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని శ్రీహరికోటతోపాటు కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాల్లోకి ప్రస్తుతం రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ప్రభావంతో జల్లులు పడే అవకాశముందని వెల్లడించింది.

మరోవైపు ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఈరోజు, రేపు తెలంగాణలో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశముందని పేర్కొన్నారు.

ఇవాళ ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో , సోమవారం ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.

More Telugu News