Karnataka: పెళ్లయిన రెండో రోజే వెళ్లిపోయి భర్తపై వేధింపుల కేసు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Karnataka HC Stays Rape Case By Woman Against Husband
  • నాలుగేళ్లు ప్రేమించుకున్న అనంతరం జనవరి 27న వివాహం
  • అప్పటికే ఆమె మరొకరిని ప్రేమించిన విషయం తెలియడంతో గొడవ
  • 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య
  • అత్తమామలపై వేధింపుల కేసు
  • చట్టం దుర్వినియోగానికి ఇంతకుమించి ఉదాహరణ ఉండదన్న హైకోర్టు
వివాహమైన రెండు రోజులకే భర్తతో గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయిన నవ వధువు ఆ తర్వాత అత్తింటిపై వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం దుర్వినియోగం అవుతోందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ ఉండదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన యువతీయువకులు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న అనంతరం ఈ ఏడాది జనవరి 27 ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. 

అయితే, ఆ వెంటనే భర్తకో నిజం తెలిసింది. ఆమె అంతకుముందు మరో వ్యక్తిని ప్రేమించిందని, ఇప్పటికీ అతడితో వాట్సాప్ ద్వారా టచ్‌లోనే ఉందని తెలిసి రగలిపోయాడు. పెళ్లయిన రెండో రోజే ఇదే విషయమై ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అదే నెల 29న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. మార్చి 2న భర్త, అతడి కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు పెట్టింది. 

పెళ్లి రోజు ఏం జరిగిందో తనకు గుర్తు లేదని, మత్తులో ఉన్నట్టు అనిపించిందని, రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకం చేసినట్టు కూడా గర్తు లేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగింది కాబట్టి తొలి రాత్రి తమ మధ్య జరిగిన చర్యను అత్యాచారంగా పరిగణించాలని కోరింది. పెళ్లికి ముందు తాను మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసి భర్త, అతడి కుటుంబ సభ్యులు తనను చిత్ర హింసలు పెట్టారని వాపోయింది.

పెళ్లయిన రెండో రోజే ఇంటి నుంచి వెళ్లిపోయి తమపై పెట్టిన కేసును భర్త, అతడి కుటుంబ సభ్యులు హైకోర్టులో సవాలు చేశారు. వారి వాదనలు విన్న ధర్మాసనం.. చట్టం దుర్వినియోగానికి ఇంతకు మించి ఉదాహరణ ఉండబోదని చెబుతూ కేసుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పరిష్కారమయ్యే వరకు భర్త, అతడి కుటుంబ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది.
Karnataka
Karnataka High Court
Abuse of Law

More Telugu News