Sharad Pawar: ఎన్సీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన శరద్ పవార్

  • ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ ను నియమించిన పవార్
  • పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటన
  • ఈ సమయంలో అక్కడే అజిత్ పవార్ 
Sharad Pawar Announces Praful Patel Supriya Sule as NCP Working Presidents

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన కూతురు సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ను నియమించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ సమయంలో అజిత్ పవార్ అక్కడే ఉండటం గమనార్హం. అజిత్ పార్టీ మారుతారని, ఎన్సీపీలో చీలిక తెస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే ఉంటూనే.. మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలు చూసుకుంటూ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ప్రఫుల్ పటేల్ కూడా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ ఝార్ఖండ్ వ్యవహారాలను చూసుకుంటారని చెప్పారు. 

ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నేతలంతా ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించి ఏర్పాటైన కమిటీ కూడా.. చీఫ్ గా పవారే ఉండాలని కోరింది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు.

అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేసుకోవాలని పవార్‌కు పార్టీ ప్యానల్ సూచించింది. ఈ నేపథ్యంలో పవార్ తాజా నియామకాలు చేపట్టారు. ఇక ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ టక్కరెకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ శాఖ బాధ్యతలు అప్పగించారు. నంద శాస్త్రిని ఢిల్లీ ఎన్సీపీ చీఫ్‌గా నియమించారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్సీపీని స్థాపించారు.

More Telugu News