most prevalent cancers: కేన్సర్ కు ప్రధాన కారకాలు ఇవే.. జాగ్రత్త!

  • స్థూలకాయం, కుటుంబ చరిత్ర, నిశ్చల జీవనంతో రిస్క్
  • పొగాకు నమలడం, పొగతాగడం ప్రమాదకరం
  • డీజిల్ వాహనాల వ్యర్థాలు, అనారోగ్యకర ఆహారం పట్ల జాగ్రత్త
major risk factors for cancers

సమాజాన్ని పట్టి పీడిస్తున్న జబ్బులలో కేన్సర్ అత్యంత కీలకమైనది. ప్రతి ఒక్కరూ దీని గురించి మెరుగైన అవగాహనతో ఉండడం వల్ల, దీని బారిన పడకుండా చూసుకోవచ్చు. అసలు ఇది ఎందుకు వస్తోంది? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 2025 నాటికి భారత్ ను కేన్సర్ పట్టి పీడిస్తుందంటూ 2022లో బీఎంసీ కేన్సర్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం హెచ్చరించింది. భారతీయులకు ప్రధానంగా ఐదు రకాల కేన్సర్లు ముప్పుగా పరిణమించాయి. లంగ్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, ఈసోఫాజియస్ కేన్సర్, ఓరల్ కేన్సర్, స్టొమక్ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటికి వైద్యులు చెబుతున్న కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లంగ్ కేన్సర్
సిగరెట్ల అలవాటు లంగ్ (ఊపిరితిత్తులు) కేన్సర్ కు ప్రధాన కారణంగా ఉంటోంది. మరి సిగరెట్ తాగని వారిలోనూ ఇటీవలి కాలంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, సిలికా, డీజిల్ వాహనాలు విడుదల చేసే పొగ లంగ్ కేన్సర్ కు కారణమవుతున్న ఇతర ముఖ్య కారకాలు. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కేన్సర్ చరిత్ర ఉంటే, వారసులకు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో లంగ్ కేన్సర్ కేసులు 6 శాతంగా ఉంటున్నాయి.

బ్రెస్ట్ కేన్సర్
మన దేశంలో నమోదవుతున్న మొత్తం కేన్సర్ కేసుల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు 13 శాతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన (పోస్ట్ మెనోపాజ్) మహిళల్లో దీని రిస్క్ ఎక్కువ. కానీ, యువతుల్లోనూ ఇది వెలుగు చూస్తోంది. వారసత్వంగా బీఆర్ సీఏ1, బీఆర్ సీఏ2 జీన్స్ మ్యుటేషన్ ఉన్న వారిలోనూ దీని రిస్క్ ఎక్కువ. అధిక బరువు, హార్మోన్ల రీప్లెస్ మెంట్ థెరపీ, శారీరకంగా కదలికల్లేని జీవనం దీనికి కారణమవుతున్నాయి.

ఈసోఫాజియల్ కేన్సర్
అన్న వాహికకు వచ్చేది ఇది. పొగాకు నమిలే అలవాటు, పొగతాగడం వల్ల దీని రిస్క్ ఎక్కువ ఉంటుంది. అచలేసియా అనే మెడికల్ కండీషన్ వల్ల కూడా ఇది వస్తుంది. అచలేసియా అనేది అన్న వాహిక కండరాలకు సంబంధించిన సమస్య. అన్నవాహికలో నరాలు దెబ్బతినడం వల్ల కూడా అచలేసియా వస్తుంది. అనారోగ్యకర ఆహార సేవనం, స్థూలకాయం, కొన్ని రకాల ఆహార కెమికల్స్ కూడా దీనికి కారణమవుతాయి.

ఓరల్ కేన్సర్
గొంతులో వచ్చే కేన్సర్ కు ఎక్కువ శాతం పొగాకు నమిలే అలవాటే కారణంగా ఉంటోంది. హ్యుమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పీవీ) వల్ల కూడా ఓరల్ కేన్సర్ వస్తుందని ఇటీవల అధ్యయనాల్లో గుర్తించారు. హెచ్ పీవీ అనేది స్త్రీలలో గర్భాశయ ముఖద్వార కేన్సర్ కు కారణమయ్యేది. నోటితో చేసే శృంగార పనులతో ఇది గొంతు కేన్సర్ కు దారితీస్తుంది. అల్ట్రావయలెట్ కిరణాలు, స్థూలకాయం వల్ల కూడా రావచ్చు.

స్టొమక్ కేన్సర్
గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ అనే సమస్య స్టొమక్ కేన్సర్ కు ప్రధాన కారణంగా ఉంది. హెలికో బ్యాక్టర్ పైలోరి (హెచ్ పైలోరి) అనే బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణమవుతుంది. పొట్టలో పాలిప్స్ ఉన్నా, అవి కేన్సర్ కు దారితీయవచ్చు. అన్ని కేన్సర్లలోనూ స్థూలకాయం, నిశ్చల జీవనం, కుటుంబ చరిత్ర ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.

More Telugu News