Harish Rao: మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడుతారు.. బీజేపీపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు

minister harish rao laid foundetion stone for 100 beds hospital in hyderabads kphb colony
  • మెడికల్‌ కాలేజీలు ఇచ్చినట్లు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హరీశ్‌ రావు
  • మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని మండిపాటు
  • తొమ్మిదేళ్లలో తాము 21 వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నామని వెల్లడి
మెడికల్‌ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ఒక్కో మెడికల్ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. కమలం పార్టీది అబద్ధపు ప్రచారమని, ఇంత దారుణం మరెక్కడా ఉండదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు’ బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. అందులో తెలంగాణకు ఒక్కటీ లేదని మండిపడ్డారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెట్టారు. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేళ్లలోనే 21 వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నాం. గతంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో డాక్టర్ల కొరత అధికంగా ఉండేది. నాడు ఎంబీబీఎస్ సీట్లు 2,950 ఉంటే నేడు 8,340 సీట్లు ఉన్నాయని, ఇకపై మన బిడ్డలు ఇక్కడే డాక్టర్లు కావొచ్చు’’ అని చెప్పారు.

హైదరాబాద్‌ నీటి కష్టాలను సీఎం కేసీఆర్‌ తీర్చారని హరీశ్‌ రావు అన్నారు. మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోనే కాదు.. పల్లెల్లో కూడా కేసీఆర్‌ 24 గంటలు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. దీంతో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు కనిపించకుండా పోయాయన్నారు.  

తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే, ప్రస్తుతం అవి 70 శాతానికి చేరాయని హరీశ్ రావు వెల్లడించారు. మన వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేదీ లేదని, కష్టపడి పని చేస్తేనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. వచ్చే నెల 14 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్‌ కిట్‌ను అందించబోతున్నామని అన్నారు. బీజేపీ మంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇస్తారని, గల్లీలో తిడుతున్నారని విమర్శించారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని, పని చేసే వారిని ఆశీర్వదించాలని కోరారు.
Harish Rao
KCR
Medical colleges
Narendra Modi
BRS
BJP

More Telugu News