Chandrababu: ఐ-టీడీపీ పనితీరు చాలా వేగంగా ఉంది: చంద్రబాబు

Chandrababu appreciates ITDP work

  • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఐ-టీడీపీ సదస్సు
  • ఐ-టీడీపీ కార్యకర్తల వల్లే 21 లక్షల మంది సభ్యత్వం నమోదైందని వెల్లడి
  • మేనిఫెస్టోను ఐ-టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచన

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఐ-టీడీపీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల తాము మేనిఫెస్టోను ప్రకటించామని, రైతులకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఇలాంటి అంశాలను ఐ-టీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో చర్చిస్తుండాలని, తద్వారా మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళుతుందని, అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. 

సమస్యలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని చైతన్యం తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. 

ఐ-టీడీపీ పనితీరు చాలా వేగంగా ఉందని కొనియాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేశారని, ఐ-టీడీపీ కార్యకర్తల కృషి వల్లే 21 లక్షల మంది సభ్యత్వం నమోదైందని అభినందించారు. టెక్నాలజీ వినియోగంలోనూ ఐ-టీడీపీ ముందంజ వేస్తోందని కితాబిచ్చారు.

ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు చేరవేసే విధానం మారుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాచారం ఎంత వేగంగా చేరవేస్తారో వారే విజయం సాధిస్తారని తెలిపారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తలకు మెసేజ్ వెంటనే చేరిపోతోందని వెల్లడించారు. ఏ కంటెంట్ ఎవరికి పంపాలో వారికి పంపిస్తూ ఐ-టీడీపీ సమర్థంగా పనిచేస్తోందని ప్రశంసించారు.

More Telugu News