Balasore: ఒడిశా రైలు ప్రమాదం: స్కూలుకు వెళ్లేందుకు వణుకుతున్న విద్యార్థులు

  • రైలు ప్రమాదం తర్వాత క్లాస్ రూంలలో మృతదేహాలను ఉంచిన అధికారులు
  • ఇప్పుడు ఆ స్కూలుకు వెళ్లేందుకు భయపడుతున్న స్టూడెంట్లు, టీచర్లు
  • ఆ స్కూలును కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్థులు
Balasore school that housed train crash victims bodies spooks students

ట్రిపుల్ ట్రైన్ క్రాష్ ఘటనతో ఉలిక్కిపడ్డ ఒడిశా గ్రామం బహనాగ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. రైలు ప్రమాదం జరిగిన తర్వాత వేగంగా స్పందించిన గ్రామస్థులు.. క్షతగాత్రులను కాపాడేందుకు చేసిన కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, తాజాగా ఈ గ్రామం ఓ సమస్యను ఎదుర్కొంటోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారు. క్లాస్ రూంలను తలచుకుని వణికిపోతున్నారు. అందులో కూర్చునేందుకు ససేమిరా అంటున్నారు. కారణం ఏంటంటే.. రైలు ప్రమాదంలో వెలికి తీసిన మృతదేహాలను అధికారులు స్కూలులోనే ఉంచారు మరి!

మరో దారిలేక స్కూలు గదులనే తాత్కాలిక శవాగారంగా ఉపయోగించారు. సహాయక సేవల్లో పాల్గొన్న గ్రామస్థులు కూడా శవాలను ఇక్కడికి మోసుకొచ్చారు. స్కూలును, క్లాస్ రూంలను చూస్తే ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడుతున్నాయని వాపోతున్నారు. దీంతో పాఠశాలలు తెరిచిన తర్వాత ఆ గదులలో కూర్చోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇష్టపడడంలేదు. గ్రామస్థులంతా ఈ విషయాన్ని జిల్లా అధికారులతో మొరపెట్టుకున్నారు.

ఆ స్కూలు భవనాన్ని కూలగొట్టి కొత్త భవనం నిర్మించాలని స్కూలు కమిటీ విజ్ఞప్తి చేసింది. గ్రామస్థుల అభ్యర్థనకు అధికారులు కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉండడంతో స్కూలు కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు సమాచారం.

More Telugu News