Canada: భారత విద్యార్థుల డిపోర్టేషన్ పై కెనడా ప్రధాని ట్రూడో ఏమన్నారంటే..!

Justin Trudeau Response On 700 Indian students Deportation
  • బాధితులను మరింత బాధపెట్టబోమని స్పష్టం చేసిన ప్రధాని
  • నిందితులను గుర్తించి, శిక్షించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరణ
  • బాధిత విద్యార్థులకు అండగా నిలబడిన పార్లమెంటరీ కమిటీ
నకిలీ అడ్మిషన్ లెటర్లతో కెనడా యూనివర్సిటీలలో చేరిన భారత విద్యార్థుల విషయంపై ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్పందించారు. భారత విద్యార్థుల డిపోర్టేషన్ అంశాన్ని క్లోజ్ గా ఫాలో అవుతున్నట్లు వివరించారు. అయితే, ఈ ప్రక్రియ నిందితులను గుర్తించడం కోసమేనని, బాధితులను మరింత బాధపెట్టాలనే ఉద్దేశం తమకు లేదని ట్రూడో స్పష్టం చేశారు. కెనడా అభివృద్ధిలో అంతర్జాతీయ విద్యార్థుల పాత్రను తాము మరువబోమని వివరించారు. డిపోర్టేషన్ విషయంలో బాధిత విద్యార్థులకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తుందని ట్రూడో వెల్లడించారు. ఈమేరకు పార్లమెంట్ లో భారత సంతతి ఎంపీ జగ్మీత్ సింగ్ అడిగిన ప్రశ్నకు ప్రధాని ట్రూడో జవాబిచ్చారు.

కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) నుంచి డిపోర్టేషన్ లెటర్లు అందుకున్న దాదాపు 700 మంది భారత విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో వచ్చి యూనివర్సిటీలలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ విద్యార్థుల్లో ఎక్కువ శాతం పంజాబ్ కు చెందినవారే. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విద్యార్థులకు అండగా ఉండాలని నిర్ణయించింది. విద్యార్థుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారందరికీ కెనడా శాశ్వత నివాస హక్కు కల్పించే మార్గం చూడాలని సీబీఎస్ఏ ను కోరాలని నిర్ణయించింది. ఈమేరకు కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నకిలీ అడ్మిషన్ లెటర్ల విషయంలో విద్యార్థులు కూడా బాధితులేనని పేర్కొంది.
Canada
Indian Students
Deportation
PM Trudeau

More Telugu News