Gangster: యూపీలో మరో గ్యాంగ్ స్టర్ ను లేపేశారు!

  • ఇటీవల ఉత్తరప్రదేశ్ లో పలువురు గ్యాంగ్ స్టర్ల హతం
  • తాజాగా లక్నో కోర్టులో కాల్పుల ఘటన
  • సంజీవ్ జీవా అనే గ్యాంగ్ స్టర్ కాల్చివేత
  • న్యాయవాదుల్లా వచ్చిన దుండగులు
Another gangster killed in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే గ్యాంగ్ స్టర్ అన్నవాడికి కాలం మూడినట్టే కనిపిస్తోంది. ఇటీవల అతీక్ అహ్మద్, అష్రఫ్ అనే గ్యాంగ్ స్టర్ సోదరులను కొందరు యువకులు కాల్చి చంపడం తెలిసిందే. అంతకు కొన్నిరోజుల ముందే అతీక్ కుమారుడు అసద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. 

యూపీలో జరిగిన ఈ వరుస ఘటనలు ఇంకా మరువకముందే మరో గ్యాంగ్ స్టర్ ను పైకి పంపారు. లక్నో నగరంలోని ఓ కోర్టులో పట్టపగలు సంజీవ్ జీవా అనే గ్యాంగ్ స్టర్ ను హత్య చేశారు. జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉండడంతో, విచారణ నిమిత్తం అతడిని కోర్టుకు తీసుకొచ్చారు. అయితే, అడ్వొకేట్ల తరహాలో నల్ల కోట్లు ధరించి వచ్చిన దుండగులు జీవాను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ గ్యాంగ్ స్టర్ అక్కడికక్కడే మరణించాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ కు, మరో బాలికకు గాయాలయ్యాయి. 

సంజీవ్ జీవా... పశ్చిమ యూపీలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు పొందాడు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి జీవా కుడిభుజం లాంటివాడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో ముక్తార్ అన్సారీ నిందితుడు కాగా, జీవా సహనిందితుడిగా ఉన్నాడు. 

కాగా, జీవా కాల్చివేతపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ, ఈ ఘటనపై తమకు సమాచారం లేదన్నారు. 

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ ఉదంతంపై మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని ప్రశ్నించారు. భద్రత అధికంగా ఉన్నచోటే హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

More Telugu News